హైడ్రా కూల్చివేతలను సమర్థించారు బీజేపీ ఎంపీ కొండా విశేశ్వర్ రెడ్డి. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా పేరుతో గొప్ప నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. హైడ్రా చేస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను 78 శాతం మంది తన సర్వేలో సమర్థంచారని చెప్పారు. అందుకే తాను బీజేపీలో ఉన్నా హైడ్రాకు మద్దతు ఇస్తున్నానన్నారు. హైడ్రా కూల్చివేతల వెనుక ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు కొండా విశేశ్వర్ రెడ్డి. కక్ష సాధింపు ఉంటే జన్వాడలోని కేటీఆర్ ఫాంహౌజ్ నే ముందు కూల్చేవారన్నారు. కాంగ్రెస్ పార్టీ బడానేతకు చెందిన అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చేసిందన్నారు కొండా.
హైడ్రా కూల్చివేతలను సమర్ధిస్తూనే పలు సూచనలు చేశారు ఎంపీ కొండా విశేశ్వర్ రెడ్డి. చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి కట్టడాలు చేపట్టిన బిల్డర్లను శిక్షించాలన్నారు. కూల్చేసిన శిథిలాల తొలగింపుకు అయ్యే ఖర్చును కూడా అక్రమార్కుల నుంచే వసూలు చేయాలన్నారు కొండా. కొందరు పేదలు కబ్జా భూములని తెలియక ప్లాట్లు కొన్నారని చెప్పారు. అలాంటి వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందన్నారు. అంతేకాదు అక్రమ నిర్మాణాలన అనుమతులు ఇచ్చి అధికారులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. దేవాలయ భూముల ఆక్రమణలకు చెక్ పెట్టాలన్నారు.జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ , బఫర్ జోన్ లో లేదన్నారు కొండా. కానీ జీవో 111 పరిధిలో ఉందన్నారు. వాటర్ చానెల్ ను పూడ్చి అక్కడ నిర్మాణం చేపట్టారని అందువల్ల దాన్ని కూల్చితే కూల్చే అవకాశాలున్నాయన్నారు.