పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పెన్షన్ దారులకు ఊరట కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మూడు నెలల పెన్షన్ 12 వేల రూపాయలు తీసుకునే వెసులుబాటు కల్పించింది. పెన్షన్ దారులకు పెన్షన్ల పంపిణీని సరళతరం చేస్తూ ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది. రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోయినా రెండో నెలలో రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇస్తారు. ఒకవేళ రెండు నెలలపాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే ఆ రెండు నెలల మొత్తాన్ని కలిపి మూడో నెలలో మూడు నెలల పెన్షన్ మొత్తం ఒకేసారి అందచేస్తారు. వరుసగా మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి ఆ పెన్షన్ ఆపివేయడం జరుగుతుందని, వారు తిరిగి యధా స్థానానికి వచ్చిన తర్వాత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి తిరిగి పెన్షన్ పునరుద్ధరించడం జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణించిన పక్షంలో అతని భార్యకు మరుసటి నెలలోనే వితంతు పెన్షన్ మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. జిల్లాస్థాయిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, క్షేత్రస్థాయిలో సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇచ్చినట్టు మంత్రి శ్రీనివాస్ ఈ ప్రకటనలో వివరించారు.