అంతర్జాతీయం

బోయింగ్ విమాలు సేఫేనా? అనుమానాలకు సమాధానాలేవి?

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 242 మంది చనిపోయారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వచ్చిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం.. అక్కడి నుంచి లండన్ కు వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ అయిన నిమిషంలోనే మెడికల్ కాలేజీ మీద కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు మెడికోలు చనిపోవడంతో పాటు విమానంలో ఒక్క ప్రయాణీకుడు మినహా మిగతావారంతా సజీవ దహనం అయ్యారు. వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎన్ఏ ఆధారంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

బోయింగ్ విమానాలపై అనుమానాలు ఎన్నో

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నేపథ్యంలో బోయింగ్‌ విమానాలపై మరోసారి తీవ్ర చర్చ జరుగుతుంది. రీసెంట్ గా ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. విమానాల నిర్మాణంలోనూ లోపాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. అందులో పని చేస్తున్న ఉద్యోగులే గతంలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ సీఈవో డేవ్ రాజీనామా చేశారు. అటు 2018, 2019లో రెండు 737 మ్యాక్స్‌ 8 విమానాలు కూలిపోయాయి. ఈ ఘటనల్లో ఏకంగా 346 మంది చనిపోయారు. ఆ విమానాలు కూడా టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయాయి. గత ఏడాది జనవరిలో అలాస్కాలో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 విమానం గాలిలో ఉండగానే దాని డోర్‌ ఊడిపోయింది. డిసెంబర్ లో  దక్షిణ కొరియాలో బోయింగ్‌ 737-800 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 179 మంది దుర్మరణం చెందారు. తాజాగా  అహ్మదాబాద్‌లో బోయింగ్‌ 787- 8 డ్రీమ్‌ లైనర్‌ విమానం కూలిపోయి 242 మంది చనిపోయారు.

ఇండియన్ ఎయిర్ లైన్స్ లో బోలెడు బోయింగ్ విమానాలు

భారతీయ విమానయాన రంగంలో బోయింగ్ విమానాలు చాలా ఉన్నాయి. అన్ని సంస్థలలో కలిపి 185 ఉన్నట్లు తెలుస్తోంది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌, 777-200 ఎల్‌ఆర్‌, 777-300ఈఆర్‌, 787-8 డ్రీమ్‌ లైనర్‌, 787-9 డ్రీమ్‌ లైనర్‌ విమానాలు ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి.  వాటి భద్రతపై మరోసారి అనుమానాలు కలుగుతున్నాయి.

Read Also: ఘోరమైన విమాన ప్రమాదం… స్పందించిన స్టార్ క్రికెటర్స్!

Back to top button