
All Time Record: తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ నేటితో ముగియనుంది. అయితే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా కాకుండా.. డబ్బుల ప్రదర్శనగా మారాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలను కూడా తలదన్నే స్థాయిలో డబ్బుల పంపకాలతో ఈ గ్రామపంచాయతీ ఎన్నికలు సంచలనంగా నిలిచాయి.
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇక్కడ రికార్డు స్థాయిలో డబ్బులు చేతులు మారినట్లు స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇంత స్థాయిలో డబ్బుల పంపకాలు చూసి ఉండరేమో అని గ్రామస్తులే వ్యాఖ్యానించే పరిస్థితి నెలకొంది. శంకరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ముగ్గురు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు పరస్పరం పోటీపడి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.
స్థానిక వర్గాల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో సుమారు రూ.6 వేల కోట్ల వరకు డబ్బు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. మూడో దశలో భాగంగా సెప్టెంబర్ 17న ఇక్కడ ఎన్నికలు జరగగా, సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులు భూములు అమ్ముకుని మరీ కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థాయి ఖర్చులు గ్రామ స్థాయి ఎన్నికల్లోనే జరగడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఓటుకు డబ్బు పంపకాల విషయంలో శంకరపల్లి ఎన్నికలు కొత్త రికార్డులు సృష్టించాయని ప్రచారం జరుగుతోంది. మొదట ఒక పార్టీకి చెందిన అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.40 వేలు ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనికి పోటీగా మరో పార్టీ అభ్యర్థి ఒక్కో ఓటరుకు రూ.50 వేలు పంపిణీ చేశాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఇక మూడో పార్టీ అభ్యర్థి తానేమీ తక్కువ కాదన్నట్లుగా ఒక్కో ఓటుకు రూ.55 వేలు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఇలా దశలవారీగా పెరిగిన ఈ పంపకాలతో కొంతమంది ఓటర్లకు మొత్తం కలిపి రూ.లక్షా 50 వేల వరకు డబ్బులు అందినట్లు తెలుస్తోంది.
ఇదే తరహాలో పటాన్‌చెరు ప్రాంతంలోనూ ఓ సర్పంచ్ అభ్యర్థి సుమారు రూ.17 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. గ్రామాల్లో ఓటుకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు సాధారణంగా పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం ఆ లెక్కలు పూర్తిగా తలకిందులయ్యాయి. డబ్బులతో పాటు మద్యం, చీరలు, గిఫ్టులు వంటి బోనస్ ఆఫర్లతో ఓటర్లను మెప్పించేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
కొన్ని గ్రామాల్లో ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏకంగా వెండి ఉంగరాలు పంపిణీ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో నివసిస్తూ ఓటు హక్కు ఉన్న గ్రామాలకు వెళ్లే ఓటర్లకు రవాణా ఖర్చులు, భోజన ఖర్చులు కూడా అభ్యర్థులే భరిస్తున్నారని సమాచారం. ఈ మొత్తం వ్యవహారం గ్రామపంచాయతీ ఎన్నికల స్వచ్ఛతపై పెద్ద ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ స్థాయిలో డబ్బుల రాజకీయాలు గ్రామ స్థాయికి చేరడం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం, యంత్రాంగం ఈ విషయాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాల కంటే ముందు, ఈ డబ్బుల రాజకీయాల ప్రభావంపై పెద్ద చర్చ మొదలవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.





