సోషల్ మీడియా వినియోగం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో కొందరు వ్యక్తులు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ, కుటుంబ బంధాలను కూడా అవమానించే స్థాయికి దిగజారడం సమాజానికి శోచనీయం. తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని కూడా విషపూరిత వ్యాఖ్యలతో కలుషితం చేయడం ఇటీవల తరచుగా కనిపిస్తున్న దృశ్యంగా మారింది. చిన్నారి తన తండ్రితో సరదాగా ఆడుకుంటున్న దృశ్యంపై గతంలో ఒక వ్యక్తి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. కుటుంబ విలువలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం అసహ్యకరమని అప్పట్లో స్పష్టం చేశారు.
ఇప్పుడీ తరహా ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో చేసిన ఒక వ్యాఖ్యకు ప్రతిస్పందనగా ఓ వ్యక్తి అత్యంత నీచమైన వ్యాఖ్యను నమోదు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం నేపథ్యంలో బాలికలపై లైంగిక దాడుల అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఆ పరిణామాలపై స్పందించిన చిన్మయి, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రతి వాతావరణంలోనూ అపాయాలు దాగి ఉండవచ్చని, అంధ విశ్వాసంతో ఎవ్వరినీ నమ్మకూడదని హెచ్చరించింది. దేశంలో బాలలపై లైంగిక నేరాలు అధికంగా నమోదవుతున్నాయని గుర్తు చేస్తూ, ఈ వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయరాదని పేర్కొంది. బాధితుల అనుభవాలు తెలుసుకుంటే అసలు పరిస్థితి స్పష్టమవుతుందని కూడా ఆమె అభిప్రాయపడింది.
అయితే ఆమె వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఒక వ్యక్తి అసహ్యకర స్థాయికి దిగజారి వ్యక్తిగత దూషణకు పాల్పడ్డాడు. ‘మీ తండ్రి కూడా నిన్ను తప్పకుండా అత్యాచారం చేసే ఉంటాడు’ అని అన్నాడు. ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్య తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనికి చిన్మయి ఘాటుగా సమాధానం ఇచ్చింది. తన తండ్రిపై అనుచిత ఆరోపణలు చేయడం దారుణమని స్పష్టం చేస్తూ, కూతుళ్లపై తండ్రులే దాడి చేస్తారనే వక్రీకృత భావనతో మీరు వ్యాఖ్యానిస్తున్న తీరు మీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె మండిపడింది. వ్యక్తుల సంస్కారం, పెంపకం వారి మాటల్లోనే కనిపిస్తుందని పేర్కొంది. ఈ ఘటన మరోసారి సోషల్ మీడియాలో బాధ్యతాయుత ప్రవర్తన ఎంత అవసరమో గుర్తు చేసింది. మహిళలపై, బాలలపై జరిగే నేరాలపై చర్చ జరగాల్సిందే కానీ వ్యక్తిగత దూషణల దారి పట్టడం సముచితం కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ALSO READ: Astrology News: సుదీర్ఘ చంద్రగ్రహణం.. హోలీ జరుపుకోవచ్చా.. లేదా?
