అంతర్జాతీయం

ట్రంప్‌ కు షాక్, సుంకాల పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న యుఎస్‌ కోర్టు

Trump Tariffs: తన మాట వినని దేశాలపై అడ్డగోలుగా టారిఫ్ లు విధిస్తున్నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుంకాల పెంపు రాజ్యంగ విరుద్ధమని యుఎస్ ఫెడరల్ కోర్టు తేల్చి చెప్పింది. అడ్డగోలుగా సుంకాలు పెంచే హక్కు ట్రంప్ కు లేదని వెల్లడించింది. ట్రంప్‌ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్‌లను పెంచినట్లు వ్యాఖ్యానించింది. భారీగా విధించిన టారిఫ్‌ల వల్ల పలు దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయయని పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుతానికి పెంచిన సుంకాలను అక్టోబర్‌ మధ్య వరకు కొనసాగించడానికి అనుమతించింది. ఈ మేరకు 7-4 తేడాతో న్యాయమూర్తులు తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై యూఎస్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు అనుమతించారు.

కోర్టు తీర్పుపై ట్రంప్ ఏమన్నారంటే?

సుంకాల విధింపు రాజ్యాంగ విరుద్ధమని  న్యాయస్థానం తీర్పు చెప్పిన నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. అమెరికా చివరికి విజయం సాధిస్తుందన్నారు.  ఫెడరల్ కోర్టు తీర్పును తప్పుబడుతూ తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌లో పోస్టు చేశారు. అన్ని దేశాలపై విధించిన సుంకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని చెప్పారు. వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని పక్షపాత అప్పీళ్ల కోర్టు తీర్పు చెప్పిందని మండిపడ్డారు. ఈ ప్రక్రియలో చివరకు అమెరికా విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ టారిఫ్‌లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుందన్నారు. అమెరికా మరింత బలపడాలి, కానీ ఈ నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి సుంకాలు ఇప్పటికీ అత్యుత్తమ మార్గమని తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్‌లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అమెరికాను బలమైన, ధనిక, శక్తివంతంగా మారుస్తానని తేల్చి చెప్పారు.

Back to top button