
Yadagirigutta Garuda Tickets: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదరిగిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీటీడీ మాదిరిగానే శీఘ్ర దర్శనం కోసం గరుడ టికెట్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ‘యాదగిరి’ ఛానెల్ తో పాటు మాసపత్రికను తీసుకురాబోతున్నట్లు తెలిపారు.
రూ. 5 వేలతో గరుడ టికెట్లు
వేంకటేశ్వర స్వామివారి శీఘ్ర దర్శనానికి తిరుమల శ్రీవాణి ట్రస్ట్ మాదిరిగా యాదగిరిగుట్టలో రూ. 5 వేల విలువైన గరుడ టికెట్లను తీసుకురానున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ ఈవో ఎస్.వెంకట్‌రావు తెలిపారు. టికెట్లు పొందిన భక్తులకు సుప్రభాత సేవ నుంచి రాత్రి శయనోత్సవ వేళ వరకు అంతరాలయ ప్రవేశం కల్పించనున్నారు. స్వామివారి వేద ఆశీర్వచనం, కండువా, కనుము, 5 లడ్డూలు, కిలో పులిహోర, కొండపైకి వాహనం అనుమతించి, ఏ సమయంలోనైనా దర్శించుకునే వీలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. అనుమతులు రాగానే అమలు చేస్తామన్నారు.
‘యాదగిరి’ చానెల్, మాసపత్రిక
అటు వైటీడీ పబ్లికేషన్ సంస్థ ఆధ్వర్యంలో త్వరలోనే ‘యాదగిరి’ ఆధ్యాత్మిక మాస పత్రిక, టీవీ ఛానల్ ను తీసుకురానున్నట్లు వెంకట్‌రావు తెలిపారు. కొండ కింద పార్కింగ్ ప్రాంతంలో వాహన పూజా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రూ.800 ఉన్న సత్యనారాయణస్వామి వ్రత పూజా టికెట్ ధరను రూ.1,000 చేయనున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రూ.20 కోట్ల వ్యయంతో 4 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్, 4మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ.3.6 కోట్ల వ్యయంతో 70 అడుగుల పొడవైన ఆంజనేయ, గరుడ, ప్రహ్లాద, రామానుజ, యాదమహర్షి విగ్రహాల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
Read Also: అన్యమత ఉద్యోగులపై టీటీడీ కఠిన చర్యలు