
భూమిపై మనం స్థిరంగా నిలబడి జీవించగలుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తే. అదే శక్తి లేకపోతే అంతరిక్షంలో వ్యోమగాములు తేలియాడుతున్నట్లే భూమిపైనా ప్రతిదీ గాల్లో తేలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిని ఊహించుకోవడమే భయానకంగా ఉంటుంది. అయితే తాజాగా ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఒక భయపెట్టే ప్రచారం వైరల్‌గా మారింది.
ఈ వైరల్ కథనాల ప్రకారం.. 2026 ఆగస్ట్ 12వ తేదీన భూమి 7 సెకన్ల పాటు తన గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతుందని ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో మనుషులు సహా అన్ని వస్తువులు గాల్లోకి లేచి తేలిపోతాయని, మళ్లీ ఒక్కసారిగా ఆకర్షణ శక్తి తిరిగి వచ్చినప్పుడు భూమిపై పడిపోవడం వల్ల భారీ విధ్వంసం చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. ఈ ఘటనలో నలభై నుంచి అరవై కోట్ల మంది వరకు మరణించే అవకాశం ఉందంటూ భయంకరమైన లెక్కలకూ తెరలేపుతున్నారు.
ఇంతటితో ఆగకుండా ఈ ప్రచారంలో నాసా పేరును కూడా జత చేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నాసా ప్రాజెక్ట్ యాంకర్ అనే రహస్య ఆపరేషన్ చేపట్టిందని, దానికి 89 బిలియన్ డాలర్లు కేటాయించిందని, ముఖ్యమైన వ్యక్తుల కోసం ప్రత్యేక బంకర్లు నిర్మిస్తున్నారని కూడా కథనాలు ప్రచారం అవుతున్నాయి. అంతేకాదు 2026 ఆగస్ట్ 12వ తేదీన యూటీసీ ప్రకారం 14.33 గంటలకు, భారత కాలమానంలో రాత్రి 8.03 గంటలకు ఈ ఘటన జరుగుతుందని ఖచ్చితమైన సమయంతో కూడిన వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఈ కథనాల్లో శాస్త్రీయంగా వినిపించే పదాలను ఉపయోగిస్తూ ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తున్నారు. రెండు బ్లాక్ హోల్స్ ఢీకొనడం వల్ల భారీ గ్రావిటేషనల్ వేవ్స్ ఏర్పడి, అవి భూమిని తాకడంతో భూమి గురుత్వాకర్షణ శక్తి తాత్కాలికంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. దీంతో అనేక మంది నిజమేనని నమ్మే పరిస్థితి ఏర్పడింది.
అయితే ఈ వార్తలపై శాస్త్రవేత్తలు, ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు స్పష్టత ఇచ్చాయి. నాసా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయకపోయినా.. నాసాకు సంబంధించిన ఒక ప్రతినిధి స్నూప్స్ అనే ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఈ ప్రచారం పూర్తిగా బూటకమని స్పష్టం చేశారు. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి భూమి మొత్తం ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. భూమి తన మాస్‌ను కోల్పోతే తప్ప గురుత్వాకర్షణ శక్తి తగ్గడం లేదా పూర్తిగా పోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
బ్లాక్ హోల్స్ ఢీకొనడం, గ్రావిటేషనల్ వేవ్స్ రావడం వంటి ఖగోళ ఘటనలకు భూమి గురుత్వాకర్షణ శక్తితో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గ్రావిటేషనల్ వేవ్స్ భూమిని దాటిపోతాయి కానీ భూమి మాస్‌పై లేదా ఆకర్షణ శక్తిపై ప్రభావం చూపే స్థాయిలో ఉండవని చెబుతున్నారు.
గురుత్వాకర్షణ శక్తి అంటే ఏ వస్తువుకు ఎంత ద్రవ్యరాశి ఉంటే అంత బలమైన ఆకర్షణ శక్తి ఉంటుందనే సూత్రం. అందుకే సూర్యుడి ఆకర్షణ శక్తి అత్యంత బలంగా ఉంటుంది. అలాగే జూపిటర్ గ్రహం గురుత్వాకర్షణ శక్తి భూమికంటే ఎక్కువ. భూమికి ఉన్న ఆకర్షణ శక్తి వల్లే మనం భూమిపై నిలబడి ఉండగలుగుతున్నాం. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కూడా ఇదే కారణం.
ఈ స్థిరమైన ఖగోళ వ్యవస్థను ఒక్కసారిగా బ్లాక్ హోల్స్ ఢీకొనడం వల్ల లేదా ఇతర కాస్మిక్ ఘటనల వల్ల మార్చడం అసాధ్యమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. భూమి 7 సెకన్ల పాటు గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతుందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అశాస్త్రీయమని, కొందరు కేవలం క్లిక్స్ కోసం ప్రజల్లో భయాలు సృష్టించేందుకు చేస్తున్న దుష్ప్రచారమని తేల్చిపారేస్తున్నారు.
భూమి ఇప్పటివరకు ఎలా ఉందో అలాగే 2026 ఆగస్ట్‌లో కూడా కొనసాగుతుందని, వెయిట్‌లెస్ డే అనే భావన పూర్తిగా అబద్ధమని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ఇలాంటి వార్తలను నమ్మకుండా శాస్త్రీయ ఆధారాలున్న సమాచారాన్నే విశ్వసించాలని సూచిస్తున్నారు.
ALSO READ: పురుషుల కంటే స్త్రీలకే ఆ కోరికలు ఎక్కువ?





