
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి తెరలేచింది. బీఆర్ఎస్ అధినేత, అసెంబ్లీ ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 9 నెలల విరామం తర్వాత మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సభలో అడుగుపెట్టడం ఇదే మూడోసారి కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మార్చి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల తర్వాత ఆయన అసెంబ్లీ వైపు తిరిగి చూడకపోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా నీటి ప్రాజెక్టులు, నదీజలాల అంశం నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలు కేసీఆర్‌ను మళ్లీ సభ గడప దాటేలా చేశాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి చాలా పరిమితంగా హాజరయ్యారు. ఈ ఏడాది మార్చి 12న గవర్నర్ ప్రసంగం రోజున ఆయన సభకు వచ్చి సుమారు 40 నిమిషాల పాటు మాత్రమే సభలో గడిపారు. ఆ తర్వాత ఆయన తిరిగి అసెంబ్లీ సమావేశాల్లో కనిపించలేదు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ కమిషన్ నివేదికపై జరిగిన కీలక చర్చలకు కూడా కేసీఆర్ దూరంగా ఉండటం అప్పట్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు.
ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన స్వయంగా రంగంలోకి దిగుతానని, ప్రభుత్వ వైఖరికి గట్టిగా సమాధానం చెబుతానని చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాల వాటాలు, గోదావరి నదీ జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా నీటి వనరులపై విస్తృత చర్చ జరపనున్నట్టు అధికారికంగా వెల్లడించింది. దీంతో ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనలో తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన పనులను గుర్తు చేస్తూ ఎదురుదాడికి సిద్ధమవుతోంది.
అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయల్దేరి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 9 నెలల తర్వాత సభలో అడుగుపెట్టనున్న కేసీఆర్ ఎలా స్పందిస్తారు, ఏ స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
అయితే కేసీఆర్ అసెంబ్లీకి హాజరైనప్పటికీ, కృష్ణా నదీజలాలపై జరిగే చర్చల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటారా లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. ఇప్పటివరకు సభలో ఆయన మాట్లాడే అంశాలపై బీఆర్ఎస్ వర్గాలు అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు అసెంబ్లీ నిబంధనల ప్రకారం కనీసం 6 నెలలకు ఒకసారి ఎమ్మెల్యేలు సభకు హాజరై సంతకం చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ చివరిసారిగా మార్చి 12న సంతకం చేశారు. ఆ తర్వాత 6 నెలలు పూర్తయినా ఆగస్టులో జరిగిన సమావేశాలకు ఆయన హాజరుకాలేదు. దీంతో నిబంధనల అంశం కూడా చర్చకు వస్తోంది.
ప్రస్తుతం నీటి వనరులపై జరుగుతున్న రాజకీయ పోరు మరింత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా నీళ్ల వాటాలు, గోదావరి జలాల పంపకం వంటి అంశాలు అసెంబ్లీలో ప్రధాన అస్త్రాలుగా మారనున్నాయి. ఈ చర్చల్లో కేసీఆర్ పాత్ర ఎంత మేరకు ఉంటుందన్నది తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. 9 నెలల నిశ్శబ్దం తర్వాత ఆయన సభలో చేసే వ్యాఖ్యలు, ప్రభుత్వంపై చేసే విమర్శలు రాబోయే రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Mukkoti Ekadashi: ఏకాదశి రోజు అన్నం ఎందుకు తినొద్దంటారో తెలుసా?





