క్రైమ్ మిర్రర్, సోషల్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. ఏడాదిన్నర క్రితమే వివాహమైన ఓ మహిళ, నెలలో 15 రోజులు తన భర్తతో, మిగిలిన 15 రోజులు తన ప్రియుడితో కలిసి గడిపేందుకు అనుమతించాలని గ్రామ పెద్దలను బహిరంగంగా డిమాండ్ చేయడం కలకలం రేపింది.
వివరాల ప్రకారం, ఆ మహిళకు వివాహమైన కొద్ది రోజులకే మరో యువకుడితో ప్రేమ సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె తొమ్మిది సార్లు తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయిందని సమాచారం. ప్రతి సారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల జోక్యంతో ఆమెను తిరిగి భర్త ఇంటికి తీసుకొచ్చారు.
అయితే తాజా ఘటనలో ఆమె నేరుగా గ్రామ పంచాయతీ ముందుకు వెళ్లి, ఇద్దరితో సమానంగా జీవించే హక్కు తనకుందని వాదించింది. తన మనసుకు నచ్చిన విధంగా జీవించాలి.. అంటూ గట్టిగా పట్టుబడడంతో గ్రామ పెద్దలు, గ్రామస్థులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ పరిణామాలతో భర్త తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. గ్రామ పెద్దల సమక్షంలో ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ, నేను ఎన్నిసార్లు క్షమించాను. అయినా ఆమె మనసు మారలేదు. ఇక ఆమె సంతోషంగా ఉండాలంటే ప్రియుడితోనే ఉండటం మంచిదేమో.. అంటూ వేదన వ్యక్తం చేశాడు.
ఆమెను బలవంతంగా తనతో ఉంచుకోవడం తనకు ఇష్టం లేదని కూడా స్పష్టం చేశాడు. ఈ ఘటన గ్రామంలోనే కాకుండా సమీప గ్రామాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, కుటుంబ విలువలు మధ్య సమతుల్యత ఎలా ఉండాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మహిళ వ్యక్తిగత స్వేచ్ఛను సమర్థిస్తుండగా, మరికొందరు సామాజిక విలువలు దెబ్బతింటాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.





