తెలంగాణ

కాళేశ్వరం ఇష్యూను సీబీఐకే ఎందుకిచ్చారు – దీని వెనకున్న పొలిటికల్‌ గేమ్‌ ఏంటి..?

Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకల కేసును సీబీఐకి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ పెట్టి.. బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడం సబబేనా..? ఇందులో పొలిటికల్‌ గేమ్‌ ఉందా..? కాంగ్రెస్‌ సర్కార్‌ ఏం చెప్తోంది..? బీఆర్‌ఎస్‌ రియాక్షన్‌ ఏంటి..? బీజేపీ వర్షన్‌ ఏంటి..?

కాళేశ్వరం కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్‌పై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయగా… గులాబీ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్‌రావుకు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఆయన ఒక్కరే వీరందరికీ సమాధానాలు ఇచ్చారు. మధ్యలో తనకు ఇచ్చిన అరగంట సమయం సరిపోదని.. అందరికీ సమాధానాలు చెప్పాలంటే… ఇంకా టైమ్‌ ఇవ్వాలని కూడా కోరారు. కానీ.. బీఆర్‌ఎస్‌కు ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం… సమయం అంతే వస్తుందని స్పీకర్‌ స్పష్టం చేశారు. అయితే గంటకుపైగానే మాట్లాడారు హరీష్‌రావు. ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ప్రశ్నలన్నింటినీ… ఒకరకంగా ధీటుగానే ఎదుర్కొన్నారని చెప్పాలి. పదే పదే మైక్‌ కట్‌ చేయడం… ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసి.. గన్‌పార్క్‌ దగ్గర నిరసన తెలిపింది. ఇకపోతే… సభలో కాళేశ్వరం కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్‌పై చర్చించిన తర్వాత… కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్మానం చేశారు. అంటే.. బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేశారు.

కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం.. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల ముందు.. ఇందులో పొలిటికల్‌ గేమ్‌ ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇన్నాళ్లు… ఈ విషయాన్ని నాన్చి.. ఇప్పుడు హడావుడిగా అసెంబ్లీలో చర్చ పెట్టడమే కాకుండా… సీబీఐ విచారణకు ఇవ్వడం కచ్చితంగా రాజకీయ ఎత్తుగడే అంటున్నారు. బాల్‌ను బీజేపీ కోర్టులోకి నెట్టి స్థానిక సంస్థల ఎన్నికల ముందు అటు బీఆర్‌ఎస్‌ను, ఇటు బీజేపీని… ఇబ్బంది పెట్టాలన్నదే కాంగ్రెస్‌ ప్లాన్‌ అని అంటున్నారు. మరి ఇప్పుడు.. బీజేపీ ఏం చేయబోతుంది…? కాళేశ్వరం కమిషన్‌పై విచారణకు సీబీఐని రంగంలోకి దింపుతుందా…? లేదా.. కాంగ్రెస్‌ వ్యూహానికి చెక్‌ పెడుతుందా…? అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేతలు మాత్రం… చట్టం తన పని తాను చేసుకు పోతుందని… బాల్‌ కేంద్రం కోర్టులో కాదు… సీబీఐ చేతిలో ఉందని అంటున్నారు. కేసు తీసుకోవాలా..? వద్దా..? అనేది పూర్తిగా సీబీఐ నిర్ణయం పైనే ఆధారపడుతుందని అంటున్నారు.

కాళేశ్వరంపై విచారణకు పీసీ ఘోష్‌ కమిషన్‌ వేసి… నివేదిక ఇచ్చిన తర్వాత… ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ వేయడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరంపై విచారణ జరపడం తమ వల్ల కాదు అనుకుని ఉంటే.. ముందే వదిలేయాల్సిందని… ఇన్ని నెలలు కమిషన్ల పేరుతో కాలయాపన చేసి.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు… కమిషన్‌ నివేదికపై ఒక్క రోజు చర్చ పెట్టి సీబీఐ కోర్టులో తోయడమేంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం పరిధిలో అన్ని దర్యాప్తు సంస్ధలు ఉంటే… సీబీఐకే ఎందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆడుతున్న పొలిటికల్‌ గేమ్‌ అని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ఆ ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు ఖండిస్తున్నారు. దమ్ముంటే సీబీఐకి రిఫెర్‌ చేయాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలే సవాల్‌ చేశారని.. ఇప్పుడెందుకు భుజాలు తముడుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసును ప్రాపర్‌గా విచారణ చేయాలంటే సమయం పడుతుంది… అందుకే పీసీ ఘోష్‌ కమిషన్‌ కొంత టైమ్‌ తీసుకుని నివేదిక ఇచ్చిందన్నారు. ఇక.. బీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. మోడీ సర్కార్‌.. కాంగ్రెస్‌ నేతలపై ఈడీ, సీబీఐని వదులుతుందని సీఎం రేవంత్‌రెడ్డే చెప్పారని అంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఇదే చేశారని.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ… బీఆర్‌ఎస్‌పైకి సీబీఐని వదిలారని విమర్శిస్తున్నారు. ఇది పొలిటికల్‌ గేమ్‌ కాక… ఇకేంటని ప్రశ్నిస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఏది ఏమైనా.. కాళేశ్వరంపై నెక్ట్స్‌ ఏంటి…? సీబీఐ కేసును తీసుకుంటుందా..? లేదా..? దీనిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button