
WHO: ప్రతి రోజు శారీరక వ్యాయామం చేయడం మన ఆరోగ్యానికి ఒక రకమైన రక్షణ కవచంలా పనిచేస్తుందని వైద్య నిపుణులు ఎన్నో సంవత్సరాలుగా చెబుతూ వస్తున్నారు. నియమిత వ్యాయామం వల్ల హృదయానికి బలం, ఊపిరితిత్తులకు శక్తి, కండరాలకు ధృఢత్వం లభించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండే అవకాశాలు కూడా పెరుగుతాయి. అయినప్పటికీ అనేక మంది బద్ధకంతోనో, సమయం లేదన్న కారణంతోనో వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. పిల్లలైనా, యువకులైనా, వృద్ధులైనా ప్రతీ వయస్సుకు ఏదో ఒక రకమైన శారీరక శ్రమ తప్పనిసరి అని వైద్య ప్రపంచం ఏకమై చెబుతోంది.
అయితే వ్యాయామం అంటే రోజంతా శ్రమపడడమో, ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదో కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవల స్పష్టతనిచ్చింది. శరీరం భరించగల శక్తికి మించి వ్యాయామం చేస్తే అది ఆరోగ్యానికే ప్రతికూలంగా మారుతుందని ఈ సంస్థ హెచ్చరించింది. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ నటుడు అధిక శారీరక శ్రమ కారణంగా మూర్చ వచ్చి ఆసుపత్రిలో చేరిన సంఘటన కూడా అధిక వ్యాయామం ఎంత ప్రమాదకరమో ప్రజలకు గట్టిగా గుర్తుచేసింది. ఆ నటుడు డిశ్చార్జ్ అయిన తర్వాత స్వయంగా అధిక వర్కౌట్ కారణంగానే అస్వస్థతకు గురయ్యానని చెప్పిన విషయం మరింత చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో WHO వయస్సుల వారీగా ఎంత సమయం, ఎంత తీవ్రతతో వ్యాయామం చేయాలి అనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
5 నుండి 17 సంవత్సరాల పిల్లలు వారానికి కనీసం మూడు రోజులు శారీరక శ్రమతో కూడిన ఆటలు, ఏరోబిక్ వ్యాయామాలు లేదా కండరాలు ఎముకలను బలహీనంగా కాకుండా ఉంచే వ్యాయామాలు చేయాలి. ఈ దశలో వ్యాయామం పిల్లల ఎదుగుదల, శరీర ధృఢత్వం, మానసిక ఏకాగ్రత సహజంగా అభివృద్ధి చెందుతాయి.
18 నుండి 64 సంవత్సరాల వయసులో ఉన్న పెద్దలు వారానికి 150 నుండి 300 నిమిషాలు మితమైన వ్యాయామం లేదా 75 నుండి 150 నిమిషాలు తీవ్రమైన వ్యాయామం చేయాలి. అలాగే వారంలో రెండు రోజులు కనీసం బరువు ఎత్తే వ్యాయామాలు లేదా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల కండరాలు బలంగా, ఎముకలు దృఢంగా ఉంటాయి. నేటి తరం ఉద్యోగాల్లో ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల శరీరం నిస్పృహ చెందుతుంది కాబట్టి ఈ వ్యాయామాలు తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.
65 ఏళ్లకు పైబడినవారు మితమైన వ్యాయామాన్ని ప్రతి వారం 150 నుండి 300 నిమిషాల వరకు కొనసాగించాలి. ఈ వయస్సులో కండరాల ద్రవ్యరాశి సహజంగానే తగ్గిపోవడం జరుగుతుంది. దానిని నిలువరించేందుకు వారానికి రెండు లేదా మూడు సార్లు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయడం చాలా ప్రయోజనకరం. పైగా వయస్సు పెరుగుతున్న కొద్దీ సంతులనం కోల్పోయే అవకాశం ఉండడంతో బ్యాలెన్స్ వ్యాయామాలు చేయడం కూడా శరీరానికి భద్రతను అందిస్తుంది.
గర్భిణీలు, బాలింతలు వారానికి 150 నిమిషాలు మితమైన తీవ్రత గల వ్యాయామం చేస్తే గర్భంలోని శిశువు ఆరోగ్యంకీ, తల్లీ శ్రేయస్సుకీ ఉపయోగకరం. అయితే ఏ వ్యాయామం ప్రారంభించినా వైద్యుల సూచన తప్పనిసరని WHO స్పష్టంగా ప్రకటించింది.
అంతేకాకుండా వ్యాయామం ప్రారంభించే ముందు శరీరాన్ని సిద్ధం చేసేందుకు 5 నుండి 10 నిమిషాల పాటు నెమ్మదిగా నడక లేదా లైట్ వార్మప్ చేయాలని వ్యాయామ శాస్త్రవేత్త కరోల్ ఎవింగ్ గార్బర్ సూచించారు. బలం పెంచుకోవాలనుకునే వారు కాలిస్టెనిక్స్, రెసిస్టెన్స్ బ్యాండ్ ఎక్సర్సైజులు, వెయిట్ ట్రైనింగ్ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
NOTE: పై వివరాలు ఇంటర్ నెట్ ఆధారంగా ప్రకటించినప్పటికీ, ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం, శక్తి, ఆరోగ్య పరిస్థితి వేరుగా ఉండటంతో ఏ రకమైన వ్యాయామాన్ని అయినా మొదలుపెట్టే ముందు నిపుణుల సలహా తప్పనిసరి. క్రైమ్ మిర్రర్ దీనిని ధృవీకరించట్లేదు.
ALSO READ: Vladimir Putin: ఎట్టకేలకు పుతిన్ భారత్ పర్యటన ఖరారు





