
తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ.. కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరో స్థాయికి చేరింది. కాంగ్రెస్ నాయకులు పోలీసుల అండతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ఇకపై సహించబోమని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ నాయకులకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై స్పందించిన మల్లయ్య యాదవ్.. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు పోలీసుల సహకారంతో ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. వేలుకు వేలు, కాలుకు కాలు అన్నట్లుగా కాంగ్రెస్ నాయకులను తరిమి కొడతామని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల తీరుపై కూడా మల్లయ్య యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ప్రజలు ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. చట్ట పరిరక్షణ బాధ్యతను పోలీసులు మరిచిపోతే, దానికి చట్టపరంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమైతే, చట్టపరంగా పోలీసుల బట్టలూడదీస్తాం.. కాంగ్రెస్ నాయకులను తరిమి కొడతాం అంటూ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు జరుగుతున్న ప్రతి ఘటనను తమ పార్టీ సీరియస్‌గా తీసుకుంటోందని మల్లయ్య యాదవ్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాలు సహజమని, కానీ దాడులు, బెదిరింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని అన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజల ఆగ్రహానికి దారి తీస్తుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా మలుపుతిరుగుతాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
ALSO READ: పక్షిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన యువకుడు (VIDEO)





