తెలంగాణ

రాజన్న కోడెలను కబేళాలకు అమ్మిన ముగ్గురు అరెస్ట్

వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడెలు రైతుల పేరిట తీసుకొచ్చి అమ్ముకున్న ముగ్గురిని వరంగల్ జిల్లా గీసుకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనల ప్రకారం గోశాల నుంచి రైతులకు రెండు కోడెలను ఇవ్వాలని ఉంది. కానీ ఆలయ అధికారులు ముగ్గురికి 66 కోడలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

మునుకొండ గ్రామానికి చెందిన మాదాసి రాంబాబు 4 నెలల కిందట రాజరాజేశ్వర సొసైటీని ఏర్పాటు చేసి మేరువంచ ఉప కాలువ వద్ద తాత్కాలికంగా గోశాలను ఏర్పాటు చేశారు. అదే మండలం అనంతారం గ్రామానికి చెందిన స్వామి, దుగ్గొండి మండలం చలపర్తికి చెందిన పసునూటి శ్యాంసుందర్‌తో కలిసి గీసుకొండ, దుగ్గొండి మండలంలోని పలు గ్రామాలలో తమకు తెలిసిన 33 మంది రైతుల నుంచి పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు సేకరించారు.

ఆ రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి రెండు దఫాల్లో డీసీఎంలలో 60 కోడెలను గోశాలకు తీసుకువచ్చారు. వాటిలో 28 కోడెలు కబేళాలకు అమ్మగా విశ్వహిందూ పరిషత్‌ నాయకులు గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాంబాబుపై కేసు నమోదు చేశారు. విచారణలో 28 కోడెలను కబేళాలకు అమ్మామని రాంబాబు ఒప్పుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ మహేందర్ వెల్లడించారు.

వ్యవహారం బయటపడడంతో 26 కోడెలు వేములవాడలో అప్పగించారు. మరో మూడు చనిపోగా మిగతా తొమ్మిదింటిని స్వాధీనం చేసుకుని… ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుల ఫోటోలు కావాలని పోలీసులను విలేకరులు కోరగా ఆయన స్పందించలేదు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకే మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button