Valentine’s Day Special: ప్రకృతిలోని అపూర్వ సౌందర్యం కళ్ల ముందే విరిసినా కలగని ఆనందం, మనసుకు నచ్చిన వ్యక్తిని చూసిన క్షణంలో కలుగుతుందనే భావోద్వేగం ప్రేమికుల హృదయాలను ఆవహిస్తుంటుంది. అయితే అదే ప్రేమలో విరహం తాకితే హృదయం ముక్కలయ్యే బాధ కూడా అంతే తీవ్రంగా వెంటాడుతుంది. ‘‘నిన్ను చూసిన ప్రతిసారి ప్రపంచం అంతా నాలోకే చేరినట్టుంటుంది. కానీ నువ్వు చూపిన నిర్లక్ష్యం నా మనసును ఎందుకు ఇలా కుదిపేసింది?’’ అంటూ ఒక భగ్న హృదయం పలికే మాటలు ఎన్నో యువ హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. చెప్పాలనుకున్న మాటలు ఎన్నో ఉన్నా, వాటిని వ్యక్తపరచే ధైర్యం లేక ఆలోచనల మధ్య చిక్కుకుపోయే స్థితి ప్రేమలో సాధారణమైపోతుంది. ప్రేమికుల దినోత్సవం రోజున అనేక భావాలను పంచుకోవాలనుకున్నా, తిరస్కరణ భయం అడుగులు ఆపేస్తుంది. ఇదే ప్రేమ మాధుర్యం, ఇదే ప్రేమ మర్మం.
ఒక్కరిద్దరి కథ మాత్రమే కాదు.. అనేక హృదయాల్లో ప్రేమ తన సంతకం వేసి వెళ్తుంది. ఎవరి జీవితంలోనైనా అది ఆనంద జల్లు కురిపిస్తే, మరెవరి జీవితంలోనో విరహ వర్షం కురిపిస్తుంది. ఒకరికొకరు చేరువయ్యే క్షణాలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అదే విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ జ్ఞాపకాలే కంటతడి పెట్టిస్తాయి. ప్రేమలో పడితే ఎండాకాలం కూడా వెన్నెలవానలా అనిపిస్తుందని అనుభవించినవారు చెబుతారు. అదే ప్రేమ విఫలమైతే వెన్నెల కూడా మంటలేసే వేడిగా అనిపిస్తుందని మరికొందరు అంటారు. అందుకే ప్రేమ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని పెద్దలు సూచిస్తుంటారు. తాత్కాలిక కోరికల కోసం ప్రేమను ఆశ్రయించడం ప్రమాదకరమని హెచ్చరికలు వినిపిస్తుంటాయి.
ప్రేమికుల దినోత్సవం చుట్టూ అనేక వాదనలు, అభిప్రాయాలు ముడిపడి ఉన్నాయి. కొందరికి ఇది ప్రేమను వ్యక్తపరచే పవిత్ర సందర్భమైతే, మరికొందరికి ఇది సంస్కృతికి విరుద్ధమనే భావన కలుగుతుంది. ఈ రెండు కోణాలకు సమాజంలో ఆధారాలు కనిపిస్తాయి. సినిమాలు, సాహిత్యం, నిజ జీవిత సంఘటనలు ప్రేమ విజయాలను, విఫలాలను ప్రతిబింబిస్తుంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమే శ్రేయస్కరమా? అనే ప్రశ్నకు ఏకైక సమాధానం ఉండదు. ఎవరి అనుభవం వారిది, ఎవరి అభిప్రాయం వారిది.
సామాజిక దృక్పథంతో ఆలోచించినప్పుడు, పరస్పరం అంగీకరించిన ఇద్దరు పెద్దలు ప్రేమించుకోవడంలో తప్పేమీ లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరస్పర అవగాహన, గౌరవం, నమ్మకం ఉంటే ఆ బంధం బలపడుతుందని చెబుతున్నారు. కుల, మత భేదాలకు అతీతంగా మనసులు కలిస్తే ఆ అనుబంధాన్ని గౌరవించడం సమాజ బాధ్యతగా చూడాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ప్రేమకు కులం లేదు, మతం లేదు, మనసుకు నచ్చిన అనుబంధమే అసలైన బలం అని వారు స్పష్టం చేస్తున్నారు. మనిషి సృష్టించిన గోడలను చెరిపేసి పరస్పర గౌరవంతో ముందుకు సాగితేనే సమతా సమాజం సాధ్యమవుతుందని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవాన్ని పరస్పర అవగాహన, గౌరవానికి ప్రతీకగా భావించి జరుపుకోవడంలో తప్పేమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: పెళ్లిపై మృణాల్ షాకింగ్స్ కామెంట్స్
