Indians Arrest In America: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల దగ్గర 49 మంది అక్రమ వలసదారులు అరెస్టయ్యారు. వీరిని బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్టు చేసినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) వెల్లడించింది. వీరిలో 30 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది. కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులను నడుపుతుండగా.. మరికొందరు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
అమెరికాలో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్‌సర్కారు విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని ఇప్పటికే నిలిపివేసింది. ఈ క్రమంలో కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు నిర్వహించిన ఆపరేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ట్రక్కులు నడుపుతున్న 42 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 30 మంది భారత్‌కు చెందిన వారు కాగా.. మిగతా వారంతా చైనా, మెక్సికో, రష్యా, తుర్కియే తదితర దేశస్థులని అధికారులు పేర్కొన్నారు. కాలిఫోర్నియాలో చేపట్టిన ఆపరేషన్ హైవే సెంటినెల్‌లో మరో ఏడుగురు అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు తెలిపారు.




