
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ శివారులోని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసింది ప్రభుత్వం. కేవలం వారం రోజుల్లోపే ఈ ప్రక్రియను రేవంత్ సర్కార్ పూర్తి చేసింది. ఆర్డినెన్స్‌పై గవర్నర్‌తో ఆమోద ముద్ర వేయించి ఈ వ్యవహారాన్ని లాంఛనం చేసింది. విలీనం అనంతర మార్పులు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఆయా మున్సిపాలిటీలను తొలగించాయి. బిల్డ్ నవ్ వంటి సైట్లలో ఇళ్ల పర్మిషన్‌కు సంబంధించిన ఫైల్స్ అప్‌లోడ్ అవడం లేదు.
అయితే, పాలనా సౌలభ్యం పేరిట సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కొన్ని చాలా గ్రామాలకు శాపంగా మారడం పట్ల ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రేకెత్తేలా చేసింది. ఎలాంటి శాస్త్రీయత, భౌగోళిక అంచనాలు లేకుండా వివిధ మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో కలిపారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. చార్మినార్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ వంటి జోన్లలో కలిపిన మున్సిపాలిటీల విషయంలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ముఖ్యంగా ఆదిభట్ల, తుర్కయంజాల్ పురపాలికలను చార్మినార్ జోన్‌లో కలపడం ఇక్కడి ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. ఆదిభట్ల పురపాలిక పరిధిలో ఒక్క ఆదిభట్ల గ్రామం తప్పితే, మిగతా ప్రాంతమంతా ఔటర్ బయటే ఉంటుంది. ఔటర్ లోపలే జీహెచ్‌ఎంసీ పరిధి అంటూ, ఈ గ్రామాలను ఎలా విలీనం చేస్తారన్న ప్రశ్నలు సందిస్తున్నారు.
తుర్కయంజాల్, ఆదిభట్ల మున్సిపాలిటీలు ఎల్బీనగర్‌కు కూతవేటు దూరంలో ఉంటాయి. ఎల్బీనగర్ నియోజకవర్గం, తుర్కయంజాల్ రెవెన్యూ ప్రాంతం ఆనుకొని ఉంటుంది. ఆదిభట్ల, తుర్కయంజాల్ నుంచి ఎల్బీనగర్‌కు రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుంది. చార్మినార్‌కు వెళ్లాలంటే తీవ్ర వ్యయ, ప్రయాసలకు ఓర్చాల్సిందే. ఆదిభట్ల మున్సిపాలిటీలోని రాందాస్‌పల్లి నుంచి చార్మినార్‌కు సుమారు 30 కి.మీ. దూరం, తుర్కయంజాల్ పురపాలిక పరిధి సంఘీనగర్ నుంచి చార్మినార్‌కు దాదాపు అంతే దూరం ఉంటుంది. దగ్గర ఉన్న ఎల్బీనగర్ నుంచి విడిచిపెట్టి, ఎక్కడో దూరంగా ఉన్న చార్మినార్‌లో కలపడం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు.
మరోవైపు గ్రామ పంచాయతీల్లోనే సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేవని, పురపాలికలు ఏర్పడ్డాక ప్రజలకు, పాలకులకు మధ్య అంతరం పెరిగిందని, ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో కలపడం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సులువుగా సమస్యలు పరిష్కారమయ్యే మార్గాలను చూడాలని కోరుతున్నారు.





