అంతర్జాతీయం

ట్రంప్ చర్యలతో ఆర్థిక విధ్వంసం, అమెరికన్ ఆర్థికవేత్తల ఆగ్రహం !

US Economist Steve HankeOn Tariff War: సుంకాల పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికన్ ఆర్థికవేత్తలు, మాజీ భద్రతా సలహాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ పట్ల ఆయన ప్రవర్తన దారుణంగా ఉందంటున్నారు. రష్యా, చైనా నుంచి భారత్‌ ను దూరం చేసేందుకు దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్‌ దెబ్బ తీశారని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ వెల్లడించారు. రష్యా  ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై భారీ సుంకాలను విధించడం మంచి పద్దతి కాదన్నారు. చైనాను కాదని భారత్‌ పట్ల పక్షపాతం చూపడమేనన్నారు. ట్రంప్‌ చర్యలు తీవ్ర తప్పిదంగా అభివర్ణించిన ఆయన, అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భారత్, రష్యా, చైనా దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపే అవకాశం ఉందన్నారు.

ట్రంప్ తీరుతో అమెరికా స్వీయ విధ్వంసం

ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించి  ట్రంప్‌.. అమెరికా స్వీయ విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆదేశ ఆర్థికవేత్త, జాన్‌ హాప్‌ కిన్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ స్టేవ్‌ హాంకె వెల్లడించారు. సుంకాలపై ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం ఓ పనికిమాలినదన్నారు. ట్రంప్‌ కట్టిన పేక మేడ కూలిపోవడం ఖాయమన్నారు.  భారత్‌ పై విధించిన సుంకాన్ని 50 శాతానికి పెంచిన నేపథ్యంలో ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్‌ తనను తాను నాశనం చేసుకుంటున్నారని తాను భావిస్తున్నానని  చెప్పారు. జీడీపీ కన్నా అధికంగా అమెరికా ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కారణంగా భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు. ఇక ఈ సుంకాలపై ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కొద్దికాలం మౌనంగా వేచి ఉండడం మంచిదని ప్రొఫెసర్‌ స్టేవ్‌ హాంకె సలహా ఇచ్చారు.

Read Also: రైతుల ప్రయోజనాలే ముఖ్యం, ట్రంప్ టారిఫ్ లపై మోడీ కౌంటర్!

Back to top button