* తెలంగాణ ప్రజా జాగృతి పార్టీకి సాంకేతిక సమస్యలు
* ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకుంటున్న కవిత
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కెసిఆర్ కు కుమార్తె కవిత షాక్ ఇవ్వనున్నారా? ఆయన పార్టీని లాగేసుకోనున్నారా? తన పార్టీ పేరును టిఆర్ఎస్ గా ప్రకటించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు తన తెలంగాణ జాగృతిని.. తెలంగాణ ప్రజా జాగృతిగా మార్చుతారని ప్రచారం నడిచింది. అయితే సాంకేతిక పరమైన కారణాలతో ఇబ్బందులు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే తమ కుటుంబానికి అచ్చొచ్చిన టిఆర్ఎస్ పేరిట పార్టీని ఏర్పాటు చేస్తారని కొత్త ప్రచారం మొదలైంది.
గులాబీ పార్టీలో కలవరం…
ఇప్పటికే కవిత గులాబీ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆది నుంచి ఆమె బిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆమె పార్టీ ఏర్పాటుతో గులాబీ పార్టీకి నష్టం అన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఒకప్పటి టిఆర్ఎస్ పేరిట పార్టీని రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తుండడం మాత్రం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. తన తెలంగాణ ప్రజా జాగృతికి సాంకేతిక పరమైన అంశాలు ఇబ్బందికరంగా మారాయి. అందుకే కోర్టులోను పిటిషన్ వేసారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆవిడ ప్లాన్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. టిఆర్ఎస్ పేరుతోనే పార్టీ పెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం.
ఈ నెలలోనే ప్రకటన..
ఏప్రిల్ లోనే ఆమె పార్టీని ప్రకటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో మళ్లీ పాత పేరుతో అంటే టిఆర్ఎస్ పేరుతో సరికొత్త అజెండాతో ముందుకు రాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈసీ వద్ద ఆ పేరు అందుబాటులో ఉందని.. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఒక ప్రత్యేక బృందం ఢిల్లీలో పనిచేస్తుందని ఆమె వెల్లడించారు. అయితే పార్టీ జెండాకు సంబంధించిన రంగులు ఎట్టి పరిస్థితుల్లో పింక్ ఉండదని తేల్చి చెప్పారట కవిత.
చంద్రబాబుపై ప్రశంసలు..
ఏపీ సీఎం చంద్రబాబును ప్రశంసించారు కవిత. ఆయన మంచి హార్డ్ వర్కర్ అంటూ తేల్చి చెప్పారు. టిడిపి నిర్మాణం కూడా చాలా బలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏపీతో ఎటువంటి సంబంధాలు పెట్టుకునే పరిస్థితిలో లేమని కూడా చెప్పారు. అమరావతి గురించి పట్టించుకోమని.. కేవలం తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పారు. గజ్వేల్ నుంచి మహిళా రిజర్వేషన్ కింద పోటీ చేసి ఆలోచన ఉందని కూడా చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కూడా వచ్చే ఎన్నికల్లో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై ఉన్న లిక్కర్ కేసు కొట్టేయడం పై స్పందిస్తూ ప్రకృతి సహకరిస్తోందని వ్యాఖ్యానించారు. అదృష్టవంతుడిని ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ కూడా ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చారని.. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ జాగృతి పార్టీ కోసం తాను కూడా నిరంతరం శ్రమిస్తానని కవిత స్పష్టం చేశారు. మొత్తానికి అయితే టిఆర్ఎస్ పార్టీతో మరోసారి తెలంగాణలో పవర్ సాధించాలన్న ఆలోచనలో ఉన్నారు కవిత. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
