
Tragedy: సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఒక విషాదకరమైన సంఘటన అందరిని కలచివేసింది. అత్తింటి వేధింపులు, మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు రోజురోజుకు భరించలేనంతగా మారడంతో ఓ వివాహిత ప్రాణాలు తీసుకునే స్థితికి చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన సుష్మ అనే మహిళకు పన్నెండేళ్ల క్రితం శ్రీకాంత్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదట్లో సాధారణ కుటుంబ జీవితం సాగినట్లు కనిపించినా.. కాలక్రమేణా అత్తింట్లోని పరిస్థితులు మారుతూ వచ్చాయి. భర్త శ్రీకాంత్ ప్రవర్తన మారడం, అత్త ఎల్లవ్వ, మామ బాబు వైఖరి కారణంగా సుష్మపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది.
తను ఎదుర్కొంటున్న బాధలను తరచుగా తన తల్లిదండ్రులకు తెలుపుతూ వచ్చేది. ప్రతిసారి వారు ధైర్యం చెప్పి, సమస్యలు తగ్గుతాయని నచ్చజెప్పేవారు. కానీ ఆమె భరించాల్సిన మానసిక వేదన మాత్రం తగ్గలేదు. చివరకు శనివారం తీవ్ర నిరాశలో ఇంట్లోనే ఉరివేసుకొని జీవితాన్ని ముగించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలన జరిపి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తె మరణానికి అల్లుడు శ్రీకాంత్, అత్త ఎల్లవ్వ, మామ బాబు కారణమని, వారు నిరంతర వేధింపులు చేశారని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ALSO READ: Hair Health: ఒక్క తెల్ల వెంట్రుకను పీకితే పది పెరుగుతాయా?





