కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో త్రివర్ణ పతాక ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. అక్టోబర్ 16న కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. దేశభక్తులంతా జాతీయ జెండాలతో ఈ నిరసనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పార్టీ సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
‘లెహ్రావో దో తిరంగా’ పేరుతో నిరసన
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో విడుదల చేసిన వీడియో సందేశంలో అభిజీత్ దీప్కే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘లెహ్రావో దో తిరంగా’ పేరుతో త్రివర్ణ పతాక ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. కేవలం జాతీయ జెండాను ప్రదర్శించినందుకే తమ పార్టీ నేతలను జైలుకు పంపారని ఆయన ఆరోపించారు.
అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌కు జాతీయ జెండాలతో చేరుకోవాలని ప్రజలను కోరారు. త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం నేరం కాదనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తామని చెప్పారు.
దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపు
ఢిల్లీకి రాలేని వారు తమ తమ ప్రాంతాల్లో తిరంగా మార్చ్‌లు నిర్వహించాలని దీప్కే విజ్ఞప్తి చేశారు. జాతీయ జెండా దేశ ప్రజల గర్వానికి ప్రతీక అని, దానిని ప్రదర్శించడం నేరంగా పరిగణించకూడదనే తమ అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమం అనంతరం తనను కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని దీప్కే పేర్కొన్నారు. అయినప్పటికీ తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తానని ప్రకటించారు.
సీజేపీ నేతలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ
మరోవైపు, జంతర్ మంతర్‌లోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో సీజేపీ సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు బుధవారం ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో పార్టీకి చెందిన మరో నేత అజింక్య షిండే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. సౌరవ్ దాస్‌ను తీహార్ జైలులోని రెండో నంబర్ జైలులో, ఆశుతోష్ రంకాను నాలుగో నంబర్ జైలులో వేర్వేరుగా ఉంచారు. ఈ ముగ్గురు సీజేపీ సభ్యులను జంతర్ మంతర్‌లోకి ప్రవేశించిన ఘటనకు సంబంధించి ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నట్లు సమాచారం.
జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఆంక్షలు
జంతర్ మంతర్‌ను నిరసన కార్యక్రమాల కోసం అనుమతించిన అధికారిక ప్రదేశాల జాబితా నుంచి తొలగించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీజేపీ నాయకత్వం త్రివర్ణ పతాక ప్రదర్శనకు పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అక్టోబర్ 16న నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటారు? పోలీసుల స్పందన ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
also read: ప్రజల గొంతును నొక్కలేరు.. దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది: ప్రకాశ్ రాజ్
