
తెలంగాణలో రెండు టీచర్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల స్థానానికి 70 శాతం పోలింగ్ జరగగా.. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇక నల్గొండ- వరంగల్- ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి దాదాపు 93 శాతం పోలింగ్ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మార్చి 3న జరగనుంది. టీచర్ ఎమ్మెల్సీ ఫలితం అదే రోజు సాయంత్రానికి రానుండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం మాత్రం మరుసటి రోజు వచ్చే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో కంటే ఈసారి హోరాహోరీగా సాగాయి. బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేయగా.. అధికార కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల సీట్లో మాత్రం పోటీ చేసింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉంది. ముఖ్యంగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దాదాపు రెండు నెలల పాటు జోరుగా ప్రచారం చేశారు. ఇక తొలిసారి ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా మూడు బహిరంగ సభలు నిర్వహించారు. గతంలో కేసీఆర్ ఏనాడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం 15 నెలల రేవంత్ సర్కార్ కు రెఫరెండమనే టాక్ వస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం కూడా గతంలో ఎప్పుడు లేనంత బలంగా వినిపించింది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై క్రైమ్ మిర్రర్ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. ఇందులో సంచలన ఫలితాలు వచ్చాయి. కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల స్థానానికి 50 మందికిపై పైగా అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు మధ్యే జరిగింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల కోసం ఆయా పార్టీల నేతలు శ్రమించారు. ఓటర్లకు భారీగానే డబ్బులు పంపిణి చేశారు. ప్రసన్న హరికృష్ణ మాత్రం బీసీ వాదంతో ముందుకు వెళ్లారు.శేఖర్ రావు స్కూల్లు, కాలేజీల ఆధారంగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ సర్వేలో మాత్రం ప్రసన్న హరికృష్ణకు మెజార్టీ రానుందని తేలింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆయనకు భారీగా పట్టభద్రులు పట్టం కట్టారని సర్వేలో తేలింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం ప్రసన్నకు అంజిరెడ్డి గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించింది. క్రైమ్ మిర్రర్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం అధికార కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డికి మూడో స్థానం రానుంది.
కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ టీచర్ ఎమ్మెల్సీలో ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డి మధ్యే జరిగింది. అయితే పీఆర్టీయూ నుంచి మరొకరు పోటీలో ఉండటంతో మల్క కొమరయ్య విజయం ఖాయమని సర్వేలో స్పష్టమైంది.నల్గొండ- వరంగల్- ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి మాత్రం రసవత్తర పోటీ జరిగింది. ఇక్కడి బీజేపీ అభ్యర్థి పులి సరోత్తమ్ రెడ్డి, పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ, యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. టీచర్ల సంఘాలు నిలబెట్టిన అభ్యర్థులకు బీసీ నినాదంతో పోటీ చేసిన పూల రవీందర్ గట్టి పోటీ ఇచ్చారు. మరో ఇండిపెండెంట్ అభ్యర్థి సుందర్ రావు యాదవ్ మాత్రం ఒక్క వరంగల్ జిల్లాలో మాత్రమే ప్రభావం చూపించారు. ఖమ్మంలో నర్సిరెడ్డికి మద్దతు కొంచెం ఎక్కువగా కనిపించగా.. నల్గొండ జిల్లాలో పూల రవీందర్ కు ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఎమ్మెల్సీ పరిధిలో దాదాపు 13 వేల మంది పీఆర్టీయూ మెంబర్స్ ఉండటంతో తన గెలుపు ఖాయమనే ధీమాలో శ్రీపాల్ రెడ్డి ఉన్నారు. అయితే సర్వేలో మాత్రం పీఆర్టీయూ ఓటర్లు శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్, సరోత్తమ్ రెడ్డి మధ్య చీలిపోయాయని తెలుస్తోంది. దీంతో నల్గొండ ఎమ్మెల్సీ ఫలితం ఉత్కంఠగా మారింది. బీసీ నినాదం పని చేస్తే పూల గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.