Homeక్రైమ్ఎలుగబంటి బీభత్సం

ఎలుగబంటి బీభత్సం

  • ఎనిమిది మందిపై దాడి
  • ఒక‌రు మృతి
  • ఆరుగురికి తీవ్ర గాయాలు
  • అట‌వి స‌రిహ‌ద్దు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి
  • అట‌వి అధికారుల ఆదేశాలు

అదిలాబాద్, క్రైమ్ మిర్ర‌ర్ః
మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా దయాల్ ధన్నుర్ గ్రామ శివారులో పొలం పనుల్లో ఉన్న ఎనిమిది మందిపై ఎలుగుబంటి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

మిగిలిన ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తెలంగాణ సరిహద్దుకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే జరగడంతో అటవీ శాఖ యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగింది. ఆ ఎలుగుబంటి ఇప్పుడు తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించినట్లు అటవీ అధికారులకు సమాచారం తెలియ‌డంతో ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖాధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ హై అలెర్ట్ ప్ర‌క‌టించారు.

దీంతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లం స‌రిహ‌ద్దులోని స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కుగుర‌వుతున్నారు.మండలంలోని నిగిని, మర్లపెల్లి అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరించే అవకాశం ఉన్నందున, ఆ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న నిగిని గ్రామం నుండి మహారాష్ట్రలోని శివిని పట్టణానికి వెళ్లే రహదారిపై ప్రయాణాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ఈ మార్గంలో ఎవరూ వెళ్లవద్దని సూచించారు.

అలాగే, పశువుల కాపరులు తమ పశువులను మేపడానికి అడవిలోకి తీసుకెళ్లవద్దని, రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఒంటరిగా అటవీ శివారు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం పహారా కాస్తున్నారు. ఎలుగుబంటి కదలికలను కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

సమీప గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో ఇళ్ల నుండి బయటకు రావద్దని, ఏవైనా అసాధారణ శబ్దాలు లేదా కదలికలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఎలుగుబంటి పట్టుబడే వరకు ప్రజలు గుంపులుగా ఉండాలని, స్వీయ రక్షణ చర్యలు పాటించాలని ప్ర‌జ‌ల‌కు డిఎఫ్ఓ విజ్ఞప్తి చేశారు.

Most Popular

Recent Comments