
-
నల్లగొండ జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన… హైకోర్టు వరకూ వెళ్లిన కుటుంబ వివాదం
నల్లగొండ (క్రైమ్ మిర్రర్ ): తండ్రి కట్టిన ఇంటిని కూల్చాలని, తల్లిని ఇంటి వెలుపల నిలిపేస్తానని కోరుకునే కొడుకు ఏ తల్లికి కావాలి? పిల్లలు కనడమే శాపమైపోయిందని వృద్ధ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది కేవలం ఆస్తి గొడవ కాదు… ఒక దాంపత్యకి జీవితాంతం ఒంటరిగా పోరాడే విధిగా చేసిన కన్నబిడ్డ చేతిలో జీర్ణించలేని మానసిక వేధింపు కథ.
కన్నప్రేమను మరిచి, కట్టిన ఇల్లును కూల్చివెయ్యాలని చూస్తున్న పెద్ద కొడుకు మర్రిగూడ మండలంలో చర్చనీయాంశంగా మారింది. అప్పుల బాధలు తట్టుకోలేక అమ్మిన రెండు ఎకరాల భూమిని చూపిస్తూ, తమపెద్ద కొడుకు మల్గిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మమల్ని ఇబ్బందులు పెడుతున్నాడని, మల్గిరెడ్డి మాధవరెడ్డి(75) సుశీలమ్మ(72)దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. గల్లీ నుండి జిల్లా దాటి, నేడు హైకోర్ట్ కు చేరిన కుటుంబ పంచాయతీ గ్రామంలో హాట్ టాపిగ్గా మారింది.
మా కొడుకు మమల్ని బ్రతకనివ్వడం లేదు
మాకు ఇద్దరు మగ పిల్లలు, ఒక కూతురు సంతానం. మాకున్న 14 ఎకరాలలో 3 ఎకరాల భూమిని మా కూతురికి రిజిస్ట్రేషన్ చేసాను. 2019 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి బాగోలేక 2 ఎకరాల భూమిని అమ్ముకున్నాము. వచ్చిన డబ్బులు తనకు కరోనా సోకడంతో వైద్య ఖర్చులకు, శ్రీనివాస్ రెడ్డి చేసిన అప్పులు తీర్చడానికి, కొంత తాము చేసిన అప్పులను తీర్పడానికి ఉపయోగపడ్డాయన్నారు. కానీ అవేమి పట్టింపు లేని తన పెద్ద కొడుకు, తమపై కక్షసాధింపు చర్యలు చెయ్యటం జిర్ణించుకోలేకపోతున్నామని మాధవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మిన రెండు ఎకరాలు తమ స్వార్థం కోసమే అమ్ముకున్నామని చిత్రీకరిస్తూ, సీతమ్మ శరలు పెడుతున్నాడని గోడున విలపించారు. వట్టిపల్లి గ్రామం నుండి జిల్లా దాటి నేడు హైకోర్టులో, తమ గూడును కూల్చాలని కన్నకొడుకే కొట్లాడటం బాధను కలిగిస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా చేసి మమల్ని హింసించే బదులు ఏదైనా ఇచ్చి మమల్ని చంపమని దుఃఖించారు.
అందుకే ఇల్లు కూల్చాలని చూస్తున్నాడు
25 సంవత్సరాల క్రితం బ్రతుకు బాగుండాలని, 12 గుంటల భూమిని తీసుకున్నాము. అందులో చిన్నవాడికి ఆరు గుంటలు, పెద్ద వాడికి ఆరు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసాము. ఇందులో ఎవరు ఏ భాగంలో ఉండాలి అనేది నిర్ణంచలేదు. ఇప్పుడు ఇదే ఆసరాగా చూసుకొని కష్టం చేసి కట్టుకున్న నా ఇల్లును అక్రమ కట్టడం అనే ముద్ర వేసాడు. ఈ వయస్సులో చేతకాని మమల్ని రోడ్డుకు ఈడుస్తూ, ఎక్కరాని కార్యాలయం మెట్లు ఎక్కిస్తూ, ఎంతో మంది అధికారులకు దండం పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. నా లాంటి కొడుకు ఎవ్వరికి పుట్టవద్దనేల పరిస్థితి తెచ్చాడు. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడినట్లు, నా బిడ్డను మేము బయట వేసుకోలేక, ఈ వ్యధను మా గుండెల్లోనే దాచుకొని కుమిలిపోతున్నాము. అధికారులతో కరెంట్ తీయించి గోస పెట్టాడని, పత్తి పంటను ట్రాక్టర్ తో దున్నించి కసి తీర్చుకున్నాడని, నిలువ నీడ లేకుండా చెలకలో ఉన్న గుడిసెను ధ్వంసం చేసాడని బోరుమన్నారు. చదువుకున్న జ్ఞానం కన్న తల్లితండ్రులను ఎలా చూసుకోవాలో నేర్పకపాయె, నీకు పుట్టిన పిల్లలు కూడా నిన్ను చూసి నేర్చుకుంటారు నాయన మమల్ని వదిలెయ్..అంత చెయ్యరాని తప్పు మేము ఎం చేసాము కొడుకా అని తల్లడిల్లారు.
డిఎల్పీవో విచారణ అనంతరం.
శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు, గత కొన్ని రోజుల క్రితం డిఎల్పీవో శంకర్ నాయక్ విచారణ అధికారిగా వచ్చారు. ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం ఇద్దరిని ఇంటికి తీసుకెళ్లి బంధుత్వాలు, బాధ్యతల గురించి చెప్పారు. కొట్లాడి సాధించేది ఏమి లేదని, ఏవైనా పొరపాట్లు ఉంటే కూర్చొని మాట్లాడితే తొలిగిపోయే సమస్యే అంటూ నచ్చజెప్పారు. అధికారి ముందు ఓకే అన్నప్పటికి, అవతలికి వెళ్లాక ససేమిరా అనడం ఆనవాయితిగా మారింది. పోలీస్ స్టేషన్ లో రాసుకున్న లేఖలు లెక్క లేకుండా పోయిందని వృద్ధులు బాధపడుతున్నారు. ఉన్న తొమ్మిది ఎకరాలలో ఇద్దరు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకొమ్మని, తమ ఇద్దరిపై ఎకరం భూమి ఉంచమని తల్లితండ్రులు కోరిన కోరిక అక్కరకు రాకుండా పోయింది. నవమాసాలు మోసిన తల్లి ఆవేదన, చెయ్యి పట్టి నడిపించి, చదివించిన తండ్రి చేసిన క్షమించరాని తప్పేమిటి..!? నాలుగు గోడల మధ్య తెగిపోయే గొడవలను రచ్చన పెట్టి, కంటికి కునుకు లేకుండా చేస్తున్నాడని. రెండు రోజుల క్రితమే మరో నోటిస్ పంపి మమల్ని మనోవేదనకు గురిచేస్తున్నాడని ఏడ్చారు.
ఇల్లుతోనే మా ప్రాణాలు పోవాలి.
ఇల్లు కూల్చే పరిస్థితి వస్తే, ఆ ఇల్లుతోనే మా ప్రాణాలు పోవాలని ఆ దంపతులు అన్నారు. కాటికి కాలు చాపిన మేము, ఈ గోసన బ్రతికి ఉండి సాధించేది ఏమి లేదని బోరుమన్నారు. నివాసం ఉన్న ఇల్లే లేకపోతే మా కాసింత బ్రతుకు ఎందుకన్నారు. ఏదైనా చేసుకొని చస్తే తప్ప మాకు ఈ తిప్పలు తప్పవని కన్నీటిపర్యంతమయ్యారు.
మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లే మాకు దిక్కని.. మీరే మమల్ని రక్షించి న్యాయం చెప్పండని వేడుకున్నారు.
ఈ సంఘటన మనల్ని క్షణపరీక్షకు గురిచేస్తుంది. ఎన్ని చదువులు చదివినా, ఎంత ఆస్తి ఉన్నా… తల్లిదండ్రులను గౌరవించని జీవితం శూన్యమే. ఈ సంఘటన, మనమందరినీ సమాజంగా ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.