
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. రెడ్డి కాలనీ ఎదురుగా నాగవెల్లి రాజలింగమూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్యచేశారు. ఈ హత్య స్థానికంగా కలకలంగా మారింది. గతంలో రాజలింగమూర్తి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి BRS ప్రభుత్వమే కారణమంటూ కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన హత్యకు గురికావడం రాజకీయంగా సంచలనంగా మారింది.
రాజలింగమూర్తిపై గతంలో భూతగాదాల విషయమై పలు కేసులు నమోదయ్యాయి. రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్ నాగవెళ్లి సరళ భర్త. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి లోని 15వ వార్డు నుంచి BRS తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందారు. కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను BRS బహిష్కరించారు.
రాజలింగమూర్తి తన సొంతూరు జంగేడు శివారు పక్కీరుగడ్డలో జరిగిన శుభకార్యానికి వెళ్లి టూవీలర్ పై భూపాలపల్లికి తిరిగి వస్తూ … తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆఫీసుకు ఎదురుగా రోడ్డును దాటుతుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఆయపై దాడిచేశారు. ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో నరికారు. తలకు బలమైన గాయంతోపాటు కత్తిపోట్ల కు దిగారు. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.