అన్నదాతల కష్టాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. జిల్లా పరిధిలోని నరసింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో పంట పొలాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ రెండు రోజుల క్రితం కాలిపోయింది. మరమ్మత్తుల అనంతరం ట్రాన్స్‌ఫార్మర్‌ను గ్రామ రోడ్డువద్ద దింపగా, అక్కడి నుంచి సుమారు కిలోమీటరు దూరం వరకు ఆరుగురు, ఏడుగురు రైతులు కర్రల సాయంతో భుజాలపై మోసుకెళ్లారు.
బురదలో కాళ్లు దిగబడుతున్నా, చెమటలు కారుతున్నా పంటలను కాపాడాలనే తపనతో వారు గమ్యస్థానానికి చేర్చిన దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. వ్యవసాయ పనుల్లో నిత్యం కష్టపడే రైతులు, ఈసారి విద్యుత్ సౌకర్యం కోసం కూడా తమ శ్రమనే ఆధారంగా చేసుకోవాల్సిన పరిస్థితి రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించేందుకు అధికారుల నుంచి సరైన సహాయం ఎందుకు అందలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాహనాన్ని తామే సమకూర్చుకుని, ఖర్చులు కూడా తామే భరించాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. అన్నదాతలకు మౌలిక వసతులు సమయానికి అందించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: రాహుల్ గాంధీ మాస్ ర్యాగింగ్.. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు

