క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం వేళల్లో బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యాశాఖ దీనికి సంబంధించి జీఓ 30 (GO 30) జారీ చేసింది.
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి, కనీసం ఒక ఏడాది ఉద్యోగ అనుభవం ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ కోర్సుల్లో చేరవచ్చు. ప్రస్తుతం ఉన్న (2025-26) విద్యా సంవత్సరం నుండే ఈ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఒక ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు.
ఎంపిక చేసిన 12 ప్రైవేట్ కళాశాలల్లో ఒకటి నుండి ఐదు కోర్సుల వరకు అనుమతి ఇచ్చారు. ఒక్కో కోర్సులో కనిష్ఠంగా 15 నుండి గరిష్ఠంగా 60 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగుల సౌకర్యార్థం తరగతులు సాయంత్రం వేళల్లో నిర్వహించబడతాయి.
రెగ్యులర్ బీటెక్ కోర్సులకు ఉండే ఫీజులే ఈ ఈవెనింగ్ కోర్సులకు కూడా వర్తిస్తాయి. బీటెక్ పూర్తి చేసిన వారు సాయంత్రం వేళల్లో నిర్వహించే ఎంటెక్ కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంది. దీని కోసం ప్రభుత్వం మరో జీఓను జారీ చేసింది.
