హైదరాబాద్ వ్యర్థాల వల్ల నల్గొండ జిల్లా వరకు కాలుష్యం విస్తరిస్తోంది
ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికే ఈ ప్రక్షాళన
నది తీరాన వాకింగ్ ట్రాక్లు, చెట్ల పెంపకం, మరియు బహిరంగ ప్రదేశాలను అభివృద్ధి చేయడం
హైదరాబాద్ నగరం మరో ఢిల్లీలా కాలుష్యమయంగా మారుతుంది
అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వం “శివతాండవం” చేస్తుంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది పునర్జీవనం మరియు ప్రక్షాళనను ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చేపట్టారు. నేడు (మార్చి 28, 2026) మూసీ నది తీరాన గల మంచిరేవుల వద్ద మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
మూసీని ఇప్పుడే ప్రక్షాళన చేయకపోతే హైదరాబాద్ నగరం మరో ఢిల్లీలా కాలుష్యమయంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వం “శివతాండవం” చేస్తుందని, ఈ పనులను ఎవరూ ఆపలేరని ఆయన హెచ్చరించారు. మూసీ నదిలోకి గోదావరి నీటిని మళ్లించి, ఏడాది పొడవునా పారేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకోసం సుమారు 20 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు ₹6,500 – ₹7,000 కోట్లు. ఇది ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు మరియు హిమాయత్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు దాదాపు 21 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. నది తీరాన వాకింగ్ ట్రాక్లు, చెట్ల పెంపకం, మరియు బహిరంగ ప్రదేశాలను అభివృద్ధి చేయనున్నారు.
నదిలోకి మురుగు నీరు చేరకుండా కొత్త మురుగునీటి శుద్ధి కర్మాగారాలను (STPs) నిర్మిస్తున్నారు. హైదరాబాద్ వ్యర్థాల వల్ల నల్గొండ జిల్లా వరకు కాలుష్యం విస్తరిస్తోందని, ఆ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికే ఈ ప్రక్షాళన అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
