
Tata Tiago EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల పట్ల ఆసక్తి గత కొద్ది సంవత్సరాలుగా భారీ స్థాయిలో పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తక్కువ ఖర్చుతో నడిచే, పర్యావరణానికి హితం చేసే ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఒక పెద్ద మార్పుకు దారితీశాయి. ఇప్పటికే టాటా, హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రముఖ బ్రాండ్లు EV మార్కెట్లో భారీ విజయాలు సాధించాయి. తాజాగా మారుతీ సుజుకీ కూడా విద్యుత్ వాహనాల తయారీలో అడుగుపెడుతుండటంతో పోటీ మరింత తీవ్రమవుతోంది.
ఎలక్ట్రిక్ కార్లు సాధారణంగా ఇంధన కార్ల కంటే ప్రారంభ ధర ఎక్కువగానే ఉండవచ్చు. కానీ మైలేజ్ పరంగా, నిర్వహణ ఖర్చుల పరంగా, మొత్తం జీవితచక్ర ఖర్చుల పరంగా EVలు చాలా ఆర్థికంగా ఉంటాయి. అందుకే నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, వ్యాపారులు, కుటుంబాలు ఇలాంటి కార్లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరుగుతుండటం, ప్రభుత్వ సబ్సిడీలు అందుబాటులో ఉండటం, కంపెనీలు పలు రకాల బ్యాటరీ ఆప్షన్లు ప్రవేశపెట్టడం వల్ల ప్రజలు మరింతగా ఈ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు. భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు ఏది? రెండు లేదా మూడు సీట్లతో చిన్న కార్లు ఉన్నప్పటికీ, కుటుంబాల కోసం 4-5 సీట్ల కార్లకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే 5 సీట్ల విభాగంలో ఏ కారు అత్యంత చౌకగా లభిస్తుందో అనేది ప్రజల్లో పెద్ద చర్చగా మారింది.
ఇప్పుడు మార్కెట్‌లో విస్తృతంగా చర్చకు దారితీసిన విషయం ఏమిటంటే.. Eva అనే చిన్న EV భారతదేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ వాహనంగా ఉంది. కానీ అది ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి మాత్రమే ప్రయాణించగలిగే రీతిలో రూపొందించబడింది. కుటుంబాల కోసం 4 సీట్లలో MG కామెట్ EV అత్యంత చౌకగా లభిస్తుంది. అయితే 5 సీట్ల సెగ్మెంట్ విషయానికి వస్తే టాటా కంపెనీ అందిస్తున్న Tata Tiago EV ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత తక్కువ ధర కలిగిన 5 సీట్ల ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరు తెచ్చుకుంది. ఇది రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండటంతో చాలా మంది కొనుగోలుదార్లు దీన్ని ఎంపిక చేస్తున్నారు.
టాటా టియాగో EV మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. కస్టమర్ల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఆరు వేర్వేరు రంగుల్లో విడుదల చేశారు. పవర్, రేంజ్ పరంగా కూడా ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్లో ఉంది. మొదటి 19.2 kWh బ్యాటరీ ఆప్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 223 కిలోమీటర్ల ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది నగర ప్రయాణాలకు చాలా సరైన ఎంపిక. ఈ బ్యాటరీ 45 kW శక్తితో పాటు 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అదే విధంగా, మరింత పొడవు రేంజ్ కోరుకునే వినియోగదారుల కోసం 24 kWh బ్యాటరీ ప్యాక్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఇది ఒకే ఛార్జ్‌పై సుమారు 293 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీని శక్తి 55 kW వరకు ఉండటం వల్ల కారు మరింత పనితీరు ప్రదర్శిస్తుంది. యాక్సిలరేషన్ పరంగా కూడా టియాగో EV మంచి సామర్థ్యాన్ని చూపుతుంది. కేవలం 5.7 సెకన్లలో 0 నుండి 60 kmph వేగాన్ని చేరుకోవటం దీని ముఖ్య ఆకర్షణల్లో ఒక్కటి. భవిష్యత్తులో EV రంగంలో మరింత అభివృద్ధి జరగనున్న నేపథ్యంలో ఈ కారు ఇంకా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించనుంది.
ALSO READ: Missing Girl Case: చేతులు కట్టేసి కాలువలోకి తోసినా తిరిగొచ్చిన బాలిక (VIDEO)





