జాతీయం

కొత్త జీఎస్టీతో డబుల్ స్పీడ్ అభివృద్ది- ప్రధానిమోడీ

PM Modi On GST 2.0: తాజాగా తీసుకొచ్చిన జీఎస్టీ 2.0తో దేశాభివృద్ధికి డబుల్‌ స్పీడ్ అందుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్‌లో నూతన శకానికి దోహదపడేలా ఈ సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఈ సందర్భంగా జీఎస్టీ 2.0 గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీలో సంస్కరణల ద్వారా భారత ఆర్థికరంగానికి పంచరత్నాలను జమ చేశామన్నారు. జీఎస్టీలో పలు శ్లాబ్‌లను హేతుబద్ధీకరిస్తూ నిర్ణయించిన 5శాతం, 18 శాతం శ్లాబ్‌లు ఈ నెల 22న మహా నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అమల్లోకి వస్తాయన్నారు.

కాలానుగుణ మార్పులను స్వాగతించాలి!

ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాలానుగుణంగా మార్పులను స్వాగతించకపోతే దేశాన్ని సరైన దారిలో నడిపించలేమని ప్రధాని మోడీ అన్నారు. భారత్‌ ఆత్మనిర్భర్‌గా మారాలంటే నూతన సంస్కరణలు చేపట్టడం అవసరమనే విషయాన్ని తాను ఎర్రకోట పైనుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పానని గుర్తు చేశారు. అంతేకాకుండా.. రానున్న దీపావళి, ఛట్‌ పూజకు ముందు రెండింతల సంతోషాన్ని పంచుతానని దేశ ప్రజలకు హామీ ఇచ్చానని చెప్పారు. కాగా, కాంగ్రెస్‌ హయాంలో నిత్యావసర వస్తువులపై కూడా భారీగా పన్నులు విధించారని, వాటిని తగ్గించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

Back to top button