
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. వెంటనే స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నారనే చర్చ జరుగుతోంది.
పవన్ సతీమణి అన్నా లెజ్‌నేవా సింగపూర్‌లో ఉంటున్నారు.ఆమె గతేడాది సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజ్‌నేవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌తో కలిసి సింగపూర్‌లో ఉంటున్నారు. కుమారుడిని అక్కడే స్కూల్‌లో చదివిస్తున్నారు. రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్‌లో మార్క్ శంకర్ చదువుతున్నాడు. ఈ స్కూల్‌లో కిచెన్ లెసెన్స్ చెబుతారట.. అన్నా అక్కడ స్టడీస్ చేస్తూ.. కుమారుడిని కూడా సింగపూర్‌లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సందర్భాల్లో సింగపూర్ వెళ్లొచ్చారు.
ఈ అగ్నిప్రమాదంలో 14 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు అయ్యాయనే విషయం తెలిసి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు వీరు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.