Egg Price Hike: గుడ్డు ధరలు భారీగా పెరుగుతున్నాయి. శనివారం మార్కెట్‌లో అమ్మాల్సిన గుడ్ల ధరను శుక్రవారం సాయంత్రమే నిర్ణయించి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ధరలు చూస్తే హోల్‌సేల్ గా 100 గుడ్ల ధర విశాఖలో రూ.660గా నిర్ణయించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ.664గా ఖరారు చేశారు. రాష్ట్రంలో ఐదు నెక్ సెంటర్లు గుడ్లు రేట్లు, మార్కెట్లలో సరఫరాను పర్యవేక్షించేవి ఉండగా… అనపర్తి, తణుకుల్లో 100 గుడ్లు రూ.665, విజయవాడలో రూ.690, చిత్తూరులో రూ.663గా నిర్ణయించారు. ఇక హైదరాబాద్‌లో రూ.656గా ఉంది. అటు శుక్రవారం ఒడిశాలోని బరంపురంలో రూ.690, చెన్నైలో రూ.670గా ఉంది.
డిమాండ్ కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో..
మార్కెట్ డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేకపోవడంతో ధర పెరుగుతోందని నెక్ వర్గాలు చెబుతున్నాయి. 3నెలల క్రితం గుడ్లుపెట్టే కోళ్లకు వ్యాధులు సోకాయి. కోళ్లు గణనీయంగా తగ్గాయి. గుడ్ల ఉత్పత్తీ భారీగా పడిపోయింది. ఫారాల్లో పిల్లలు పెరిగి గుడ్లు పెట్టే దశకు రావాలంటే 3 నెలలు పడుతుంది. అందువల్ల రెండు నెలల నుంచి బాగా ఉత్పత్తి తగ్గింది. జనవరి మూడో వారం తర్వాత గుడ్ల ఉత్పత్తి పెరుగుతుందని, అప్పటివరకూ ధరలు ఎక్కువగానే ఉంటాయని రైతులు అంటున్నారు.
పడిపోయిన గుడ్ల ఉత్పత్తి
ఉత్తరాంధ్రలో 75 ఫారాల్లో ప్రతిరోజూ 40-42 లక్షల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. కానీ గత రెండు నెలలుగా 36-38 లక్షలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఈశాన్య భారతం, ఉత్తరాదికి గుడ్ల ఎగుమతి పెరగడంతో స్థానిక మార్కెట్లలో కొరత వచ్చిందని, ధర పెరగడానికి అదీ ఒక కారణమని రైతులు చెప్తున్నారు. మరో నెల రోజుల్లో పరిస్థితి నార్మల్ కు చేరే అవకాశం ఉందంటున్నారు. అప్పటి వరకు వినియోగదారులకు ధరలను భరించక తప్పదని చెప్తున్నారు.





