
Double Dating Culture: కాలం మారుతున్న కొద్దీ యువతలో ఆలోచనలు, సంబంధాలను చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తల్లిదండ్రులు చూసిన సంబంధానికే ‘అవును’ చెప్పడం పరిపాటిగా ఉండేది. ప్రేమ పెళ్లి, డేటింగ్, వ్యక్తిగత అభిరుచులు వంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. అయితే ఇటీవలి కాలంలో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఇప్పుడు తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో యువత తల్లిదండ్రుల అభిప్రాయాలతో పాటు తమ ఆలోచనలను కూడా సమానంగా పరిగణిస్తున్నారు. నమ్మకమైన స్నేహితుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తాము కోరుకునే వ్యక్తి నిజంగా తమకు సెట్ అవుతారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి డేటింగ్ కల్చర్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇప్పుడు డేటింగ్ అనేది కేవలం పరిచయం కోసం కలిసే సందర్భం మాత్రమే కాదు.. ఇద్దరి మధ్య ఆలోచనలు, అభిరుచులు, జీవన దృక్పథం, సంబంధాలపై ఉన్న అంచనాలు సరిపోతాయా లేదా అన్నది అర్థం చేసుకునే ఒక ప్రాసెస్‌గా మారింది. ఒకరి గురించి ఒకరు తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా మాట్లాడుకోవడం, ఒకటి రెండు రోజులు కలిసి గడపడం వంటి ఆచారాలు ఇప్పుడు చాలా కామన్ అయ్యాయి. ఒకరికి ఒకరు నచ్చితే సంబంధం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. నచ్చకపోతే ఆ సంబంధాన్ని అక్కడితో ముగించే అవకాశం కూడా ఉంటుంది. విదేశాల్లో పుట్టిన ఈ ట్రెండ్ భారతదేశంలో, ముఖ్యంగా నగరాల్లో గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరించింది.
తాజాగా ఈ డేటింగ్ ట్రెండ్‌లో మరో కొత్త అలవాటు పెరుగుతోంది. అది ‘డబుల్ డేట్’. ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్ విడుదల చేసిన ‘ఇయర్ స్వైప్ 2025’ రిపోర్ట్ ప్రకారం ఈ ట్రెండ్ మహిళల్లో అత్యధికంగా ప్రాచుర్యం పొందుతోంది. ఒక్కరే ఒంటరిగా డేటింగ్‌కు వెళ్లడం కొంత అసౌకర్యం కలిగించవచ్చని, భద్రతాపరంగా సందేహాలు ఉండవచ్చని భావించడం వల్లే ఈ కొత్త పద్దతి పెరుగుతోంది. అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలియకపోవడం, ఎవరితో కలుస్తున్నారు, వారి స్వభావం ఎలా ఉంటుంది వంటి సందేహాలు ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్లేందుకు చాలా మంది సంకోచిస్తారు.
ఇలాంటి సందేహాలను దృష్టిలో పెట్టుకుని మహిళలు ఇప్పుడు డేటింగ్‌కు ఒకరికి బదులు ఇద్దరు వెళ్లే విధానాన్ని ఎంచుకుంటున్నారు. తమకు అత్యంత నమ్మకమైన స్నేహితుడు, సోదరి, సోదరుడు లేదా కలీగ్‌ను తోడుగా తీసుకెళ్తున్నారు. దీనిని ‘ఎమోషనల్ కో-పైలట్’ సపోర్ట్ అని నిపుణులు చెబుతున్నారు. అంటే మనసికమైన ఆత్మవిశ్వాసం కోసం, భద్రత కోసం, అవసరమైతే మాట్లాడేందుకు లేదా ఆ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు తోడుగా ఉండే వ్యక్తి.
టిండర్ నివేదిక ప్రకారం డబుల్ డేట్ ఫీచర్‌ను మహిళలు.. పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీరిలో 85 శాతం మంది 30 ఏళ్లలోపు ఉన్నవారే. సింగిల్ డేట్‌ల కంటే డబుల్ డేట్‌లలో చాట్‌లు సుమారు 25 శాతం పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ ముఖ్యంగా జెన్‌జీ, మిలీనియల్స్ మధ్య వేగంగా విస్తరిస్తోంది. కారణం, పూర్తిగా తెలియని వ్యక్తితో ఒక్కరే కలవడం మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు స్నేహితులు ‘సపోర్ట్ సిస్టమ్’ గా మారుతూ డేటింగ్ సమయంలో తోడుగా వెళుతున్నారు.
ALSO READ: Good News: మహిళలకు వచ్చే ఏడాది నుంచి ఫ్రీ బస్‌కు స్మార్ట్ కార్డులు





