
Winter: చలికాలం వచ్చిందంటే వేడి నీటితో స్నానం చేయాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చలిచలి గాలుల్లో వేడి నీటితో స్నానం చేసే హాయే వేరు. అందుకే ఈ కాలంలో చాలా మంది వేడినీటితోనే స్నానం చేయడానికి ఇష్టపడతారు. ఒకప్పుడు నీటిని వేడి చేసేందుకు కట్టెలు, పొయ్యిలపై ఆధారపడేవారు. కాలం మారడంతో పాటు టెక్నాలజీ కూడా ముందడుగు వేసింది. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే చాలు నిమిషాల్లో వేడి నీరు అందించే గీజర్లు, వాటర్ హీటర్లు అందుబాటులోకి వచ్చాయి.
గీజర్లు ఖర్చుతో కూడుకున్నవిగా ఉండటంతో చాలా మంది తక్కువ ధరకు లభించే వాటర్ హీటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి సరైన జాగ్రత్తలు పాటించకుండా వాడితే ప్రాణాలకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది. ప్రతి ఏడాది చలికాలంలో వాటర్ హీటర్ ప్రమాదాలపై వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కాబట్టి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
వాటర్ హీటర్ వాడేటప్పుడు ముందుగా ప్లగ్, స్విచ్ వ్యవస్థపై పూర్తి అవగాహన ఉండాలి. కొంతమంది ముందుగా ప్లగ్‌లో పెట్టి, ఆ తర్వాత బకెట్‌లో వాటర్ హీటర్ వేస్తారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఎప్పుడూ ముందుగా హీటర్‌ను నీటిలో పూర్తిగా ముంచి, ఆ తర్వాత మాత్రమే ప్లగ్‌ను స్విచ్‌బోర్డ్‌లో పెట్టాలి. నీరు వేడి అయిన తర్వాత ముందుగా స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్ తీసిన తర్వాతే హీటర్‌ను బయటకు తీయాలి. అప్పటివరకు బకెట్‌ను ముట్టుకోవడం కూడా ప్రమాదకరమే.
వాటర్ హీటర్ ఉపయోగించే బకెట్ విషయంలో కూడా జాగ్రత్త తప్పనిసరి. చాలామంది అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ లేదా ఇనుప బకెట్లను ఉపయోగిస్తుంటారు. ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారి తీస్తుంది. ప్లాస్టిక్ బకెట్లలో హీటర్ వాడితే వేడి వల్ల అవి కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇనుప బకెట్లలో వాడితే కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే ఎప్పుడూ అల్యూమినియం బకెట్ మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వాటర్ హీటర్ ఆన్ చేసినప్పుడు పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టాలి. ఫోన్ మాట్లాడటం, ఇతర పనుల్లో బిజీ కావడం వంటివి చేయకూడదు. ఎప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి అన్న విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పూర్తిగా పవర్ ఆఫ్ చేశాకే నీరు వేడయ్యిందా లేదా పరీక్షించాలి. పొరపాటున ఆన్‌లో ఉన్న హీటర్‌ను చేతితో ముట్టుకుంటే తీవ్ర ప్రమాదం సంభవించవచ్చు.
ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే మరింత అప్రమత్తంగా ఉండాలి. వాటర్ హీటర్‌ను పిల్లలు తిరగని ప్రదేశంలో మాత్రమే ఉపయోగించాలి. వీలైతే ఆ గదిని తాళం వేసి ఉంచడం మంచిది. హీటర్ ఆన్ చేసిన సమయంలో ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలకు ఈ ప్రమాదాల గురించి ముందే అవగాహన కల్పించడం కూడా చాలా అవసరం. పిల్లలు ఉన్న ఇళ్లలో స్టౌపై నీటిని వేడి చేయడం కొంతవరకు సురక్షితం.
నీటి పరిమాణం విషయంలో కూడా చాలామందికి స్పష్టత ఉండదు. బకెట్‌లో ఎంత నీరు పోయాలి, ఎక్కడివరకు హీటర్ ముంచాలి అనే విషయాలు చాలా ముఖ్యం. సాధారణంగా ప్రతి వాటర్ హీటర్‌పై నీటి లెవల్ మార్క్ ఉంటుంది. ఆ సూచనల ప్రకారమే నీటిని పోయాలి. ముఖ్యంగా హీటింగ్ కాయిల్ పూర్తిగా నీటిలో మునిగేలా చూసుకోవాలి. నీరు తక్కువగా ఉంటే హీటర్ దెబ్బతినడంతో పాటు ప్రమాదం కూడా జరగొచ్చు.
చలికాలంలో వేడి నీరు అవసరం అయినా.. భద్రతా నియమాలు పాటించకపోతే అదే వేడి నీరు ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. కుటుంబ సభ్యుల భద్రత కోసమే కాదు.. మీ స్వంత ప్రాణ రక్షణ కోసమూ వాటర్ హీటర్ వాడేటప్పుడు పూర్తి అప్రమత్తత అవసరం.
ALSO READ: భారత్‌లోనూ 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయాలా?





