
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీని ముందుగానే అంచనా వేసిన ఆర్టీసీ.. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన బీహెచ్ఈఎల్, మియాపూర్ ప్రాంతాల్లో నివసించే వారికి ఊరటనిచ్చేలా బీహెచ్ఈఎల్ డిపో నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది.
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి 5 వేలకుపైగా బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు 2,500 వరకు బస్సులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 వేల వరకు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 9వ తేదీ నుంచి ప్రయాణికుల రద్దీని బట్టి ఈ ప్రత్యేక బస్సులు దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం బస్సుల సంఖ్య, రూట్లు, టైమింగ్స్‌పై కసరత్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో స్పెషల్ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం కూడా పెద్ద సంఖ్యలో బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పండుగ సమయాల్లో టికెట్ల కోసం ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు తగ్గనున్నాయి.
ఇక మరోవైపు సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొత్తం 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్పెషల్ హాల్ట్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి నడిచే 16 రైళ్లు హైటెక్ సిటీ స్టేషన్లో ఆగనున్నాయి. దీనివల్ల ఐటీ ఉద్యోగులు, నగర శివారు ప్రాంతాల ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది.
అలాగే సికింద్రాబాద్- విజయవాడ మార్గంలో నడిచే 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లి స్టేషన్లో ప్రత్యేక హాల్ట్ ఏర్పాటు చేశారు. నగర రద్దీని తగ్గించడంతో పాటు, ప్రయాణ సమయాన్ని ఆదా చేసే దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. ఆర్టీసీ బస్సులు, రైల్వే ప్రత్యేక హాల్ట్‌లతో ఈసారి సంక్రాంతి ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని ప్రయాణికులు భావిస్తున్నారు.
ALSO READ: ఇందిరమ్మ ఇళ్లు.. వారికి ప్రభుత్వం శుభవార్త





