తెలంగాణ

మంచిర్యాల,పెద్దపల్లిలో పరిశ్రమలే లక్ష్యం: ఎంపీ వంశీకృష్ణ

క్రైమ్ మిర్రర్, మంచిర్యాల:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పలు అభివృద్ధి, రాజకీయ అంశాలపై స్పందించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పరిశ్రమలు తీసుకురావడానికి పార్లమెంట్‌లో గళం విప్పినట్లు చెప్పారు.
రాజకీయ కారణాలతో సెమీ కండక్టర్ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తరలించారని ఆరోపించారు. అయినప్పటికీ 500 నుంచి వెయ్యి కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకువచ్చే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. మంచిర్యాలలో వందే భారత్ రైలు హాల్టింగ్‌ వల్ల ప్రయాణికుల ఇబ్బందులు తొలగడంతో పాటు రైల్వేకు ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.

ఈఎల్ఐ స్కీమ్‌ను పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో రూ.80 వేల కోట్ల నిధులు, హమాలీవాడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌కు రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు.
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. కూలీ దినాలను 100 నుంచి 60కి తగ్గించడం, రూ.90 వేల కోట్ల నిధులను కోత విధించడం దారుణమన్నారు. మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయాలనేదే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. మందమర్రిలో లెదర్ పార్క్, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్దపల్లి–మణుగూరు రైల్వే లైన్‌కు రూ.4 వేల కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. చెన్నూర్, క్యాతనపల్లిలో అమృత్ స్కీమ్–2.0 కింద శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి పనులు కొనసాగుతున్నాయన్నారు.
163 పెండింగ్ పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రులను కోరినట్లు చెప్పారు. పత్తి కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీసీఐ దృష్టికి తీసుకెళ్లామన్నారు. యూరియా దిగుమతుల్లో కేంద్రం విఫలమైందని, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సరిగా నడపకపోవడంతో ఉత్పత్తి తగ్గి రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్‌కు రూ.55 లక్షలు మంజూరు కావడంతో సర్వే పూర్తైందని, త్వరలో రామగుండం ఎయిర్‌పోర్ట్ కల నెరవేరుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక స్కామ్‌లు జరిగాయని ఆరోపిస్తూ, కాంగ్రెస్‌పై బురదజల్లడం మానుకోవాలని బాల్క సుమన్‌కు సూచించారు.
బెల్లంపల్లిలో నిర్వహించిన జాబ్‌మేళాల ద్వారా రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, నిరుద్యోగ యువతకు ఉపాధే లక్ష్యంగా కార్యాచరణ కొనసాగుతుందన్నారు. బిహార్ ఎన్నికల ముందు రూ.10 వేల హామీలు ప్రజాస్వామ్యానికి విఘాతమని, దేశంలో బహిరంగంగా ఓటు చోరీ జరుగుతోందని ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button