
తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. సీనియర్ నేత జానారెడ్డిని పబ్లిక్ మీటింగ్ లోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి కుట్రలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. దీంతో జానారెడ్డి ఎందుకు కోమటిరెడ్డికి చెక్ పెట్టారన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు మరో షాకింగ్ విషయాన్ని బయట పెడుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మంత్రి పదవుల్లో ఉన్నారు.సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. కాని ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు ఎంపీగా.. మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా కూడా జానారెడ్డి మరో కీలక పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా జానారెడ్డిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు అసలు సమస్యకు కారణమని సమాచారం.
Also Read : హైడ్రా పేరుతో కోట్లు డిమాండ్.. సీఎం రేవంత్ అనుచరుడిపై జనం సీరియస్
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన జానారెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా పదవి ఇవ్వాలంటే ఒకే జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గం నుంచి నలుగురికి పదవులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకత వస్తుందనే చర్చ జరుగుతోంది. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి చెక్ పెడుతూనే తనకు ప్రభుత్వ సలహాదారుగా అవకాశం ఉండేలా జానారెడ్డి కొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. అందుకే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాశారనేది కోమటిరెడ్డి వర్గీయుల ప్రధాన ఆరోపణ. జానారెడ్డి రాసిన లేఖతో పార్టీలో పెద్ద దుమారమే లేవడమే గాక మంత్రి వర్గ విస్తరణను పక్కన పెట్టేశారన్న చర్చ జరుగుతోంది.
జానారెడ్డి లేఖ రాయడంపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ఫైర్ అయ్యారు. 25 యేండ్లు మంత్రి పదవి అనుభవించినప్పుడు జానారెడ్డికి ఇతర జిల్లాల గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అసలు ధర్మరాజుగా ఉండాల్సిన పెద్దాయన ధృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నాడంటూ కూడా రాజగోపాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి పార్టీ అధిష్టానానికి లేఖ రాయడం వెనుక తనకు ప్రభుత్వ సలహాదారు పదవి కోసమేనని చర్చ జరుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇక రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో నల్గొండ ఎంపీగా గెలుపొందిన జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డిని నల్గొండ జిల్లా కేంద్రంలోకి రాకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎంపీగా నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే ఏ ఒక్క కార్యక్రమానికి రఘువీర్ రెడ్డి హాజరు కావడం లేదట. దీంతో జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ తో కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Also Read : రేవంత్ నాఇంటికి వచ్చి పిలిస్తేనే కాంగ్రెస్ లో చేరా.. వివేక్ సంచలనం
తనకు ప్రభుత్వ సలహాదారు పదవి తెచ్చుకునేందుకు జానారెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే జానారెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారని టాక్. చూడాలి మరి మంత్రి పదవి ఇస్తానన్న హామీ ఇచ్చిన అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి అవకాశమిస్తుందా లేక జానా రాసిన లేఖతో పక్కన పెట్టేస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలంటున్నారు. అంతేకాదు రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఈ ఇద్దరి నేతల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని కాంగ్రెస్ కేడర్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..