Monday, February 16, 2026
Homeజాతీయంపెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వివాహానికి ముందు స్త్రీ, పురుషుల మధ్య శారీరక సంబంధాల అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడన్న ఆరోపణలతో నమోదైన కేసులో బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందుగా ఒకరినొకరు పూర్తిగా నమ్మడంలో జాగ్రత్త అవసరమని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టులో జస్టిస్ బి.వి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి పరస్పరం అపరిచితులేనని, సంబంధం ఎంత సన్నిహితంగా ఉన్నా శారీరక బంధానికి ముందుగా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉందని మౌఖికంగా అభిప్రాయపడ్డారు. బహుశా తమ ఆలోచనలు పాతకాలపు కావొచ్చని వ్యాఖ్యానించిన జస్టిస్ నాగరత్న, పెళ్లికి ముందే ఇలాంటి బంధాల్లోకి వెళ్లడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరినీ పూర్తిగా నమ్మకూడదని, వ్యక్తిగత భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కేసు వివరాల ప్రకారం.. బాధిత మహిళకు 2022లో ఓ వివాహ పరిచయ వేదిక ద్వారా నిందితుడితో పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుంటానని నమ్మబలికిన అతడు అనేక సార్లు ఢిల్లీ, దుబాయ్ ప్రాంతాల్లో ఆమెతో కలిసి గడిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో ఆమెకు తెలియకుండా వీడియోలు చిత్రీకరించి, తరువాత అవి బయటపెడతానని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, అతనికి ఇదివరకే వివాహం జరిగినట్టు, 2024 జనవరిలో పంజాబ్‌లో మరో మహిళను పెళ్లి చేసుకున్నట్టు బాధితురాలు గుర్తించింది. మోసపోయానని భావించి పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ మంజూరు చేయాలని అతడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

విచారణలో భాగంగా ఫిర్యాదుదారు నిందితుడిని కలవడానికి దుబాయ్‌కు ఎందుకు వెళ్లిందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది, ఇద్దరూ వివాహ ఉద్దేశంతో పరిచయం కొనసాగించారని వివరించగా, వివాహంపై అంత కట్టుబాటుగా ఉంటే పెళ్లికి ముందు విదేశీ ప్రయాణాలు చేయకూడదని వ్యాఖ్యానించారు. పరస్పర సమ్మతితో ఏర్పడిన సంబంధాల విషయంలో శిక్షార్హత అంశాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ కేసును మధ్యవర్తిత్వానికి పంపాలని సూచించిన ధర్మాసనం, ఇరుపక్షాల మధ్య సమస్య పరిష్కారం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనింది. తదుపరి విచారణ కోసం కేసును బుధవారం వరకు వాయిదా వేసింది. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.

ALSO READ: త్రిషకు సారీ చెప్పిన బీజేపీ నేత.. ఎందుకో తెలుసా?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments