
Nagarjuna Sagar Water Level: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు అన్ని ప్రాజెక్టులను నింపగా, ఇప్పుడు ఇప్పుడు నాగార్జునసాగర్ లోకి వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే శ్రీశైలం పూర్తిగా నిండగా, రెండు గేట్ల ద్వారా 1.57 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది.
సాగర్ గేట్లు ఓపెన్ చేసేది ఎప్పుడంటే?
ఇక నాగార్జున సాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 276.09 టీఎంసీలకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ఇప్పుడు 579 అడుగులకు నీరు చేరుకుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు కేవలం 6,598 క్యూసెక్కులను నీటిని మాత్రమే వదులుతున్నారు. ఈ వారంలో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అటు అటు పులిచింతలకు కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.70 టీఎంసీలకు చేరింది.
గోదావరి బేసిన్ లో వరదలు అంతంత మాత్రమే!
అటు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఎగువన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద వస్తోంది. భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ త్రివేణి సంగమం సమీపంలో గోదావరి 9 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం 26 అడుగులుగా ఉంది.