
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- మండలంలోని వట్టిపల్లి గ్రామంలో వెలసిన ప్రాచీన, ఏకశిల శ్రీభవాని రామలింగేశ్వర స్వామి, జాతర ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ముగిసింది. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఖ్యాతి గడించిన, శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అబ్బురపరిచిన ‘పద్మశాలీల’ తక్షణ నేత
ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణ పద్మశాలీలు సమర్పించే పట్టువస్త్రాలు. ఉమ్మడి వట్టిపల్లి గ్రామ పరిధిలోని, రాజపేటతండాకు చెందిన పద్మశాలీలు, కళ్యాణ వేదిక వద్దకు వస్తున్న మార్గ మధ్యంలోనే, భక్తులు చూస్తుండగానే అప్పటికప్పుడు, మగ్గంపై పట్టు వస్త్రాలను నేసి స్వామివారికి సమర్పించారు. ఏండ్ల నాటి ఈ అరుదైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగడం విశేషం. అప్పటి మాజీ సర్పంచ్ మారగోని వెంకటయ్య ఆధ్వర్యంలో, పునఃప్రారంభించిన ఈ జాతర ఉత్సవాలు, నేటికీ అదే ఉత్సాహంతో కొనసాగుతోంది.
గౌడన్నల బోనాల సమర్పణ
ఆలయ పరిధిలోని శ్రీ సురమాంబ కంఠ మహేశ్వర స్వామికి, గ్రామ గౌడ కులస్థులు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు. శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాహలం మధ్య, బోనాల ఊరేగింపు వైభవంగా సాగింది. ప్రస్తుత సర్పంచ్ శిరసవాడ బిక్షమయ్య, భక్త బృందంతో జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం మామిడి ఇందిరమ్మ వెంకటయ్య, నీల నిర్మల మహేష్ లు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రథోత్సవ సంబరాలు జాతరలో భాగంగా, నేడు వట్టిపల్లి గ్రామంలో రథోత్సవం జరగనుంది. గ్రామ పురవీధుల గుండా సాగే స్వామివారి రథయాత్రను తిలకించేందుకు, ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది.”ఏకశిల రామలింగేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ పురాతన ఆలయ వైభవాన్ని కాపాడటం మన అందరి బాధ్యతగా గ్రామస్థుల నినాదం..





