
కోదాడ, క్రైమ్ మిర్రర్:- కోదాడ పట్టణం రాజకీయ వేడితో ఉక్కిరిబిక్కిరైంది. దళిత యువకుడు కర్ల రాజేష్ లాక్‌అప్ డెత్ ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శన పట్టణాన్ని కుదిపేసింది. వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు బైకులు, కార్లు, ఇతర వాహనాల్లో తరలివచ్చి గులాబీ దండు సైన్యంలా ముందుకు సాగారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఈ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పోలీసుల అత్యుత్సాహాన్ని ఖండిస్తూ పట్టణమంతా నినాదాలతో మార్మోగింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పాలనకు ఇది గట్టి హెచ్చరికగా మారిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని తీవ్ర స్థాయిలో ప్రసంగించారు.నిరసన ప్రదర్శనకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. రాజేష్ హత్య జరిగి 60 రోజులు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించకపోవడం ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమని విమర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలు కాంగ్రెస్ నేతలకు టూరిస్టు ప్రాంతాలుగా మారాయని, పట్టణంలో షాడో ఎమ్మెల్యేల మాఫియా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. పోలీసుల ఆగడాలు అదుపు తప్పుతున్నాయని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పట్టణ సీఐ శివశంకర్ వ్యవహారశైలి ‘కాకి చొక్కా తొడిగిన చందంగా’ మారిందని విమర్శించిన ఆయన, ఇసుక, మద్యం, మట్టి మాఫియాలతో పోలీసులకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు గుప్పించారు.
Read also : బాలాపూర్ లో ధర్మరక్షణ మహా సభ…!
రాజేష్‌ను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అతని మృతికి చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి ప్రత్యక్ష కారణమని ఆరోపిస్తూ, ఇప్పటివరకు అతనిపై చర్యలు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధారాలతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, అధికారాన్ని ఉపయోగించి బాధ్యులను వెనకేసుకొస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రాజేష్ మరణంతో వృద్ధ తల్లి అనుభవిస్తున్న వేదనకు కారణమైన వారంతా తగిన సమయంలో శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనలో అధికారులకు మాత్రమే భద్రత ఉందని, సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని విమర్శించారు.ఇకపై బీఆర్ఎస్ కార్యకర్తలపై ఏ చిన్న దాడి జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ప్రజలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, దోషులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ నిరసన కోదాడ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read also : Mouni Roy: తాత వయసున్న వారు నడుముపై చేయి వేసి, లో యాంగిల్‌లో ఫొటోలు తీశారు





