
ఎమ్మెల్యే రాజాసింగ్… సొంత పార్టీకే కొరకరాని కొయ్యలా మారారు. ఆయన తీరుతో విసిగిపోయిన అధిష్టానం చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీంతో… మరింత రెచ్చిపోయిన ఎమ్మెల్యే.. దమ్ముంటే చర్యలు తీసుకోండి అంటూ సవాల్ చేస్తున్నారు. అంతేకాదు… తనను సస్పెండ్ చేస్తే.. పార్టీలోని ఒక్కొక్కరి గుట్టు విప్పుతానంటూ బెదిరిస్తున్నారు. దీంతో.. తెలంగాణ బీజేపీలో ఏం జరగబోతుందనే టెన్షన్ మొదలైంది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీరు… తెలంగాణ బీజేపీలో కల్లోలం రేపుతోంది. ముందు నుంచి ఆయన రెబలే. అయితే.. కొంతకాలంగా సొంత పార్టీ నాయకత్వంతో ఆయనకు సరిపోవడంలేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా రాజాసింగ్‌ను కలిసి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. కానీ.. ఇది కొంత కాలం వరకే పనిచేసింది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. మళ్లీ మామూలే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ మధ్యకాలం రాజాసింగ్ నుంచి ధిక్కారస్వరం మరింత పెరిగింది. సొంత పార్టీ నేతలపై ఆయన విమర్శలు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు ఆయన మద్దతు ఇవ్వడం.. రాష్ట్ర బీజేపీ నాయకత్వానికే కాదు.. హైకామాండ్‌కు కూడా మింగుడు పడటంలేదు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనానికి ప్రయత్నాలు జరిగాయని కవిత ఆరోపిస్తే… నిజం కావొచ్చని.. తెలంగాణ బీజేపీలో అలాంటి నాయకులు ఉన్నారని అన్నారు రాజాసింగ్. ఈ వ్యాఖ్యలతో హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీకి ఆదేశాలు ఇచ్చింది.
రాజాసింగ్‌కు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ నోటీసులు ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో.. రాజాసింగ్ మరింత ఘాటు విమర్శలు చేశారు. నోటీసులు కాదు దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలంటూ సవాల్ చేశారు. అంతేకాదు… పార్టీ నేతలను హిజ్రాలతో పోల్చారాయన. అంతేకాదు… తనను సస్పెండ్ చేస్తే.. పార్టీలోని సీనియర్ నేతల గట్టు విప్పుతానంటూ కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీ నాయకత్వం మరింత సీరియస్ అయ్యింది. రాజాసింగ్ వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో చర్చించబోతోంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఒకవేళ.. రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తే… ఆ తర్వాత.. ఆయన ఏం చేస్తారు..? చెప్పినట్టే.. టీబీజేపీలోని సీనియర్ నేతల గుట్టు విప్పుతారా…? ఏమో.. ఏదైనా జరగొచ్చు. ఈ పరిణాలతో తెలంగాణలో మరో రాజకీయ రగడ మొదలైనట్టే.