తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి గండం ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులతోనే ప్రభుత్వ మనుగడకు ప్రమాదం రాబోతోందని అన్నారు. గ్రూప్ 1 ఆందోళనలు తారాస్థాయికి చేరుకోవాలని కాంగ్రెస్ లోనే కొందరు నేతలు కోరుకంటున్నారంటూ బాంబ్ పేల్చారు బండి సంజయ్. ముఖ్యమంత్రి సీటు కోసం కొందరు కాంగ్రెస్ నేతలు గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారని అన్నారు. గ్రూప్ 1 గొడవను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని సూచించారు బండి సంజయ్.
నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం తలగోక్కుంటుందని బండి సంజయ్ ఆరోపించారు. గ్రూప్ 1 విషయంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని.. జీవో 29ను వెంటనే ఉపసంహరించుకోవాలని బండి సంజయ్ అన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జ్ దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపై రాక్షసంగా వ్యవహరిస్తోందని అన్నారు. గుంజుకొచ్చి మరీ పోలీసులతో కొట్టిస్తారా?..నిరుద్యోగులు చేసిన తప్పేంది? మానవతా థ్రుక్పథంతో వ్యవహరించాల్సిన ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందా?..కాంగ్రెస్ ను నమ్మి లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటే ఇట్ల చేస్తరా? అని నిలదీశారు. జీవో 29 నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందన్న సంజయ్.. జీవో 29 జారీ చేసినోళ్లకు బుద్ది లేదని విమర్శించారు.
రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ అనాలోచిత, దుర్మార్గపు, చిల్లర నిర్ణయం తీసుకుందన్నారు. నిరుద్యోగుల పొట్ట కొట్టడానికే 29 జీవో జారీ చేశారని మండిపడ్డారు. ఈ జీవోను సవరించి న్యాయం చేయమని అడిగితే కొట్టిస్తారా?.. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తే తప్పేందని సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ కు, కాంగ్రెస్ పాలనకు తేడా ఏముందన్నారు. తప్పుడు నోటిఫికేషన్లు, పరీక్షా పత్రాల్లో తప్పులు, తప్పుడు జీవోలతో నిరుద్యోగులతో జీవితాలతో చెలగాటమాడుతున్నారని బండి ధ్వజమెత్తారు. నిరుద్యోగుల మధ్య చిచ్చుపెట్టి కొట్టుకునేలా చేసి లబ్ది పొందేందుకే జీవో నెంబర్ 29 జారీ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే 29 జీవోను ఉపసంహరించుకోవాలి
గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులకు అండగా ఉంటనని ప్రకటించారు. సమస్య జఠిలం కాకుండా సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే తారుమారు అవుతాయన్నారు సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితిలో పడిపోయేలా చేసుకోవద్దని హెచ్చరించారు. నిరుద్యోగుల పక్షాన అవసరమైతే ఆందోళన చేస్తానన్నారు. కేంద్ర మంత్రి పదవి సంగతి తరువాత.. తనకు నిరుద్యోగుల జీవితాలే ముఖ్యం అన్నారు బండి సంజయ్.