
-
సోషల్ మీడియాలోనూ విస్తృత చర్చకు దారి
-
మద్యం నియంత్రణ దిశగా కదులుతున్నా గ్రామాలు
-
వ్యాపారులు సమయాల్లో మార్పులు కోరిన శున్యమే మిగులుతుంది
-
రాజగోపాల్ రెడ్డి సంకల్పానికి మద్దతుగా యువత
-
చాటు మాటుగా మద్యం అమ్మకాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న యువత
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్: మునుగోడు నియోజకవర్గంలో మద్యం నియంత్రణ దిశగా గ్రామాలు కదులుతున్నాయి. ప్రజారోగ్యమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఉద్యమానికి శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంకల్పం బలంగా నిలుస్తోంది… మద్యం షాపుల సమయపాలనపై వెనక్కి తగ్గేదే లేదని మద్యం వ్యాపారులకు తేల్చి చెప్పిన ఆయన నిర్ణయానికి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, మేధావులు, సామాజిక వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే వ్యాపారం మంచిది కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ విస్తృత చర్చకు దారితీశాయి..
మద్యం మహమ్మారి కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్న వాస్తవాన్ని ప్రజలు తమ అభిప్రాయాల ద్వారా వెల్లడిస్తున్నారు. 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్మూలిస్తానని హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి, ఆ పిలుపుతో కొన్ని గ్రామ పంచాయతీలు గ్రామసభ తీర్మానాలు చేసి బెల్ట్ షాపులను తొలగించాయి.. బెల్ట్ షాపులు లేని గ్రామాలకు తన మాతృమూర్తి పేరుతో ఉన్న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అయితే అప్పట్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటంతో ఉద్యమం పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు.
2023లో మళ్లీ గెలిచిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణ లేకుండా చర్యలు తీసుకున్నారు. నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన అనంతరం వైన్ షాపుల నిర్వహణపై స్పష్టమైన సూచనలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మాత్రమే వైన్ షాపులు తెరవాలి, సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూములు ప్రారంభించాలన్న ఆదేశాలతో మునుగోడులో మద్యం నియంత్రణ..సమయపాలన కొనసాగుతోంది. ఇటీవల కొందరు వ్యాపారులు సమయాల్లో మార్పులు కోరగా, ఎలాంటి సడలింపులూ ఉండవని ఎమ్మెల్యే తెగేసి చెప్పారు.
ఈ విధానానికి ప్రజల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ బెల్ట్ షాపులు, చాటు మాటుగా మద్యం అమ్మకాలు జరగకుండా అవగాహన కల్పిస్తున్నారు. గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో యువత కిరాణా షాపుల వద్దకు వెళ్లి కౌన్సిలింగ్ ఇస్తూ, రాజగోపాల్ రెడ్డి సంకల్పానికి మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. చాటు మాటుగా మద్యం అమ్మితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ప్రకృతి నియమాలకు అనుగుణంగా మనిషి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కష్టపడి పని చేయాలన్న జీవన విధానాన్ని గుర్తు చేస్తూ, ఉదయం నుంచే తాగుడు అలవాటుకు స్వస్తి పలకాల్సిన అవసరాన్ని ఈ ఉద్యమం నొక్కిచెబుతోంది.
తాను తాగుడుకు వ్యతిరేకం కాదని, పనిచేయకుండా అతిగా తాగే విధానానికే వ్యతిరేకమని ఎమ్మెల్యే పలుమార్లు స్పష్టం చేశారు. మొదట మనం పాటిస్తేనే ప్రజలు పాటిస్తారన్న ఆలోచనతో తన అనుచరులు, అభిమానులు పగటిపూట మద్యం సేవించొద్దని సూచించగా, నాయకులు, అభిమానులు కూడా ఆ నియమాన్ని అమలు చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మారుతున్న ఈ ముఖచిత్రం బెల్ట్ షాపు రహిత గ్రామాల దిశగా సాగుతున్న ర్యాలీలు, యువత కౌన్సిలింగ్, కఠిన సమయపాలన మద్యం నియంత్రణలో ఒక కొత్త అధ్యాయంగా నిలుస్తోందని స్థానికులు అంటున్నారు.





