
విజయవాడ (క్రైమ్ మిర్రర్):-హైదరాబాద్‌లోని “సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్” వ్యవహారంలో డాక్టర్ నమ్రత అరెస్టు అనంతరం, తాజాగా విజయవాడలో అదే పేరుతో ఉన్న “సృష్టి ఫెర్టిలిటీ సెంటర్”పై పోలీసులు నిఘా పెట్టారు. ఈ కేంద్రంలో ముగ్గురు వైద్యుల ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు గుర్తించారు. విజయవాడ సృష్టి సెంటర్‌ను ప్రధానంగా డాక్టర్ కరుణ నిర్వహిస్తుండగా, డాక్టర్ సోనాలి పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. పిల్లలు లేని దంపతులకు ఫెర్టిలిటీ చికిత్స పేరుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీరు క్యాంపులు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌లో స్పెర్మ్ సేకరణ క్లినిక్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన అరెస్టుల నేపథ్యంలో, విజయవాడలోని డాక్టర్లు కరుణ, సోనాలి కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం వీరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమతి లేకుండా కొన్ని కార్యకలాపాలు, చట్ట విరుద్ధమైన పద్ధతులు అమల్లో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. త్వరలోనే ఈ వ్యవహారంలో కీలక వివరాలు వెలుగు చూడనున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.