
PM Modi China Visit: అమెరికా టారిఫ్ ల మీద టారిఫ్ లు విధిస్తున్న నేపథ్యంలో భారత్ కీలక అడుగులు వేస్తోంది. అమెరికాకు దూరం జరుగుతూ చైనాకు దగ్గర కావాలని భావిస్తోంది. పొరుగు దేశంతో సఖ్యతగా ఉండటం మేలు అనే ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే సుమారు 7 సంవత్సరాల తర్వాత ప్రధాని మోడీ చైనా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నెలాఖరులో ఆయన చైనాలో పర్యటించనున్నారు.
షాంఘై సహకార సంఘం సదస్సుకు హాజరు
తాజాగా మోడీ చైనా పర్యటనకు సంబంధించిన వివరాలను భారత విదేశాంగశాఖ వెల్లడించింది. రెండు దేశాల పర్యటనలో భాగంగా మొదట ఆగస్టు 29న ప్రధాని మోడీ జపాన్ కు వెళ్తారు. అక్కడ ఇరుదేశాల వార్షిక సదస్సులో జపాన్ ప్రధానితో సమావేశం అవుతారు. అనంతరం చైనాలో పర్యటిస్తారు. తియాంజిన్ వేదికగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 1 వరకు జరగనున్న షాంఘై సహకార సంఘం వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం గురించి చర్చించనున్నారు. అమెరికా సుంకాల వ్యవహారంపైనా చర్చించే అవకాశం ఉంది.
గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి
గతేడాది రష్యాలోని కజాన్ లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో చివరిసారిగా జిన్ పింగ్ తో మోడీ సమావేశం అయ్యారు. అయితే, గాల్వాన్ లో సరిహద్దు ఘర్షణల తర్వాత ప్రధాని మోడీ చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి. 2019లో ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు. ఏడు సంవత్సరాల తర్వాత మరోసారి చైనాలో అడుగుపెట్టబోతున్నారు.
రష్యా అధ్యక్షుడితో ప్రధాని మోడీ సమావేశం
అటు షాంఘై సహకార సంఘం వార్షిక సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును వ్యతిరేకిస్తూ భారత్‌పై ట్రంప్ భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: అమెరికా చర్యలకు తగిన జవాబిస్తాం.. సుంకాల పెంపుపై భారత్ ఆగ్రహం!