పుష్ప హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి గాంధీభవన్ లో అవమానం జరిగిందనే ప్రచారం సంచలనంగా మారింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని కలిసేందుకు వెళ్లిన కంచర్లకు అపాయింట్ మెంట్ లభించకపోవడంతో అసహనంతో వెళ్లిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే పుష్ప మామకు గాంధీభవన్ లో అవమానం జరిగిందనే వార్తలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో ఒకడన్నారు మహేష్ కుమార్ గౌడ్. మమ్మల్ని కలవడానికి వచ్చినట్టు మాకు ముందుగా సమాచారం లేదన్నారు. ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళని చూసి పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు అంటూ అతను వెళ్ళిపోయారని.. వెళ్లిన వెంటనే తనకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. అల్లు అర్జున్ మీద మేమెందుకు కక్ష చూపిస్తామని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. అల్లు అర్జున్ మామ మా కాంగ్రెస్ సభ్యుడే అంటే అల్లు అర్జున్ కూడా మా కుటుంబ సభ్యుడే కదా అని అన్నారు.
అల్లు అర్జున్ మామ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కోరిన చేయడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అల్లు అర్జున్ సంఘటన పై టిఆర్ఎస్ బిజెపి నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడక గాని ప్రతిపక్షాలకు గుర్తు రాలేదన్నారు. చిత్రశీమ ఆంధ్రకు వెళుతుందని చాలా సిల్లీగా మాట్లాడుతున్నారని.. అసలు చిత్ర సీమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిందే కాంగ్రెస్ నాయకులు వల్లని తెలిపారు. చిత్ర సీమకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.