Uncategorized

తప్పు జరిగింది.. క్షమించండి!తిరుమలలో పవన్ కల్యాణ్ కన్నీళ్లు

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తప్పు జరిగింది.. బాధ్యత తీసుకుంటాము అన్నారు. మృతుల కుటుంబీకులు, క్షతగాత్రులు, రాష్ట్ర ప్రజలు, వేంకటేశ్వర స్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్కరినీ క్షమించమని ప్రభుత్వం కోరుతోంది అన్నారు.

తిరుమలలో తొక్కిసలాట చోటు చేసుకున్న బైరాగిపట్టెడ ప్రాంతంలోని పద్మావతి పార్క్, రామానాయుడు పబ్లిక్ స్కూల్ పరిసరాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, చిత్తూరు ఎస్పీ, డిఎస్పీలతో చర్చించారు. ప్రమాదానికిగల కారణాల గురించి ప్రశ్నించారు. అక్కడి నుంచి స్విమ్స్ కు చేరుకొని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్నవారినీ, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు జనసేనాని.

తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు, అడిషినల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి బాధ్యత తీసుకోవాలని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. వారు తమ బాధ్యతల నిర్వహణలో విఫలం అయ్యారని..వారి మధ్య, పాలక మండలి మధ్య గ్యాప్స్ ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో పోలీసులు బాధ్యత తీసుకోవాలి.. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదని భక్తులు చెబుతున్నారని తెలిపారు.టీటీడీ సిబ్బంది, పోలీసులు ఉండి కూడా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు పవన్ కల్యాణ్. ఇంతమంది పోలీసు అధికారులున్నా తప్పు ఎందుకు జరిగిందని ప్రశ్నించారు.

తొక్కిసలాట జరిగితే సహాయక చర్యలు ఎలా ఉండాలనే ప్రణాళిక కూడా లేదని పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.. అధికారులు చేసిన తప్పులకు మేము తిట్లు తింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయని..ప్రక్షాళన మొదలు కావాల్సిన అవసరం ఉందన్నారు. వీఐపిలపై కాదు సామాన్యులకు దర్శనాలపై దృష్టిపెట్టాలన్నారు. మృతుల కుటుంబాల దగ్గరకు టీటీడీ సభ్యులు, అధికారులు వెళ్ళి క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button