Under 19 Asia Cup: అండర్-19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్ నిలిచింది. ఓటమనేదే లేకుండా ఫైనల్ చేరిన యువ భారత్.. కీలక పోరులో ఘోరంగా విఫలమైంది. ఏకపక్షంగా జరిగిన అండర్-19 ఆసియా కప్ టైటిల్ ఫైట్‌లో 191 పరుగుల తేడాతో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ సెంచరీతో (113 బంతుల్లో 172) విరుచుకుపడడంతో భారత బౌలర్లు కుదేలయ్యారు. అహ్మద్ హుస్సేన్ (56) హాఫ్ సెంచరీ చేశాడు. దీపేష్ దేవేంద్రన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హనిల్, ఖిలన్ చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు.
156 పరుగులకే భారత్ ఆలౌట్
అనంతరం ఛేదనలో భారత్ 26.2 ఓవర్లలో 156 పరుగులకు కుప్పకూలింది. దీపేష్ (36) టాప్ స్కోరర్. భారీ ఛేదనలో భారత్ టపటపా వికెట్లు చేజార్చుకొంది. కెప్టెన్ ఆయుష్ మాత్రే (2), వైభవ్ సూర్యవంశీ (26)ని అలీ రెజా పెవిలియన్ చేర్చడంతో.. భారత్ ఏ దశలోనూ ఛేదించే విధంగా కనిపించలేదు. పాక్ పేసర్ల షార్ట్ పిచ్ బంతులకు భారత బ్యాటర్లు తట్టుకోలేపోయారు. అలీ రెజా నాలుగు వికెట్లు పడగొట్టగా.. సుభాన్, ఎహ్‌సాన్, సయ్యమ్ తలో రెండు వికెట్లు సొంతం చేసుకొన్నారు. పాక్ ఆటగాళ్లతో ‘నో హ్యాండ్ షేక్’ పాలసీని మన క్రికెటర్లు ఈ మ్యాచ్‌లో కూడా పాటించారు.
రెచ్చగొట్టిన పాక్ బౌలర్ అలీ రెజా
ధాటిగా ఆడుతున్న సమయంలో వైభవ్ వికెట్ కోల్పోయాడు. అతడు అవుట్ అయిన తర్వాత గ్రౌండ్ నుంచి వెళ్తున్న సమయంలో పాక్ బౌలర్ అలీ రెజా ఓవరాక్షన్ సూర్యవంశీకి ఆగ్రహం తెప్పించాయి. దీంతో వెనక్కి తిరిగి నోటికి పనిచెప్పిన వైభవ్.. నువ్వు నా బూటుకు అంటిన దుమ్ముతో సమానం అన్నట్టుగా వేలు చూపిస్తూ సంజ్ఞ చేశాడు. అంతకుముందు భారత కెప్టెన్ ఆయుష్ అవుటై వెళ్తున్నప్పుడు కూడా అలీ రెజా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో డగౌట్‌కు వెళ్తున్న ఆయుష్ ఆగ్రహంతో వార్నింగ్ ఇచ్చాడు.





