ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పుర్ నగరంలో ఉన్న ఒక పెట్రోల్ బంకులో ఉద్రిక్తతకు దారితీసిన సంఘటన కలకలం రేపింది. పెట్రోల్ బంకులో పొగ తాగవద్దని సిబ్బంది హెచ్చరించడంతో ఆగ్రహానికి లోనైన వ్యక్తి ఏకంగా పెట్రోల్ ట్యాంక్ వద్దే మంట రాజేయడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాయ్‌పుర్ నగరంలోని ఉర్లా పరిధిలో ఉన్న సంగీత పెట్రోల్ బంక్‌కు ధర్మేంద్ర సింగ్ క్షత్రియ, ఇమ్రాన్ ఖురేషి అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. సిబ్బంది వాహనానికి ఇంధనం నింపుతున్న సమయంలో వెనుక కూర్చున్న వ్యక్తి సిగరెట్ వెలిగించేందుకు ప్రయత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న సిబ్బంది పెట్రోల్ బంక్‌లో పొగ తాగడం ప్రమాదకరమని, నిప్పు వెలిగించవద్దని గట్టిగా వారించారు.
ఈ హెచ్చరికను అవమానంగా భావించిన యువకుడు ఆగ్రహంతో ప్రవర్తించాడు. చేతిలో ఉన్న లైటర్‌ను ఉపయోగించి వాహనంలోని పెట్రోల్ ట్యాంకు వద్ద ఒక్కసారిగా నిప్పు రాజేశాడు. దీంతో ఇంధనం నింపుతున్న గొట్టం భాగం మంటల్లో చిక్కుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీశారు.
అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తక్షణమే మంటలను ఆర్పే పరికరాలను వినియోగించి అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు. క్షణాల్లో స్పందించకపోతే భారీ పేలుడు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. సిబ్బంది చాకచక్యంతో పెద్ద ప్రాణనష్టం, ఆస్తినష్టం తప్పినట్లు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ధర్మేంద్ర సింగ్ క్షత్రియ, ఇమ్రాన్ ఖురేషీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో ఉపయోగించిన ద్విచక్ర వాహనం, లైటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ALSO READ: అవినీతికి పాల్పడుతున్న పంచాయతీ రాజ్ ఏఈపై చర్యలు తీసుకోండి
